ఏపీ బడ్జెట్ 2026-27, పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు.. ఆర్థిక మంత్రి పయ్యావుల ఫైర్
ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 14 Feb 2026 4:15 PM ISTఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల నిర్వహణకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితిలో.. ఈ దుస్థితి రావడానికి గత ప్రభుత్వ వైఫలమ్యే కారణమంటూ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శించారు. జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఆర్థిక సుస్థిరత సాధించేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ సమయంలోనే రాష్ట్ర అప్పుల కోసం విమర్శలు చేస్తున్న ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. వారసత్వంగా వైసీపీ ప్రభుత్వం అందజేసిన అప్పులు రాష్ట్ర ఖజానాపై పెద్ద భారం మోపాయని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రం చేస్తున్న అప్పులపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కేశవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షానికి చురకలు అంటించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ‘‘మాకు 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లింది మీ ప్రభుత్వమే. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.‘‘ అంటూ ధ్వజమెత్తారు కేశవ్. ప్రస్తుతం తమ ప్రభుత్వం సేకరిస్తున్న అప్పులలో ప్రతి రూపాయిని ఉత్పాదక వ్యయంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉండేదని దుయ్యబట్టారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. ఖర్చులు తగ్గించుకుని, వనరులు పెంచుకుని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని.. ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనున జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పయ్యావుల వివరించారు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా ఏకంగా 12.3 శాతం వరకు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి ఆరోపించారు.
రాష్ట్రానికి భారంగా మారిన వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని శాసనసభలో మంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు రూ.43,298 కోట్ల రుణాలకు వడ్డీని తగ్గించి ఏడాదికి రూ.327 కోట్లు ఆదా చేశామని తెలిపారు. అదనంగా రూ.1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇలా ఏడాదికి రూ.1,658 కోట్లు ఆదా చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్రాన్ని అప్పులలో ముంచిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను పాటిస్తున్నట్లు సంకేతాలు పంపింది. రెవెన్యూ లోటును గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, ఈ ఏడాది ఎక్కువ మూలధన వ్యయం ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించింది. 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లు ఉండగా, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు లెక్కించింది. అదేవిధంగా ద్రవ్యలోటు రూ.80,567 కోట్ల నుంచి రూ.75,868 కోట్లకు తగ్గించింది. ఇక మూల ధన వ్యయాన్ని గత బడ్జెట్ కంటే ఎక్కువ పెంచింది ప్రభుత్వం. 2025-26 రివైజ్డ్ అంచనాల్లో మూల ధన వ్యయం రూ. 39,497.56 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం రూ. 53,915.38 కోట్లకు పెంచింది. గత ఏడాది కంటే దాదాపు రూ.14,417 కోట్లు అధికంగా ఈ ఏడాది మూలధన వ్యయం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు.
