Begin typing your search above and press return to search.

బీజేపీకి నో చాన్స్...వారికి నిరాశేనా ?

ఏపీ బీజేపీకి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి రాజ్యసభ సీట్ల విషయంలో నిరాశ తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే లాగానే ఉన్నాయని అంటున్నారు.

By:  Satya P   |   26 May 2026 9:04 AM IST
బీజేపీకి నో చాన్స్...వారికి నిరాశేనా ?
X

ఏపీ బీజేపీకి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి రాజ్యసభ సీట్ల విషయంలో నిరాశ తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే లాగానే ఉన్నాయని అంటున్నారు. జూన్ 20న ఏపీలో ఏకంగా నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడే ఈ ఎంపీ సీట్లకు సంబంధించి బలాబలాలను చూస్తే మొత్తం సీట్లు కూటమి పరం అవడం ఖాయం. మరి ఇందులో కూటమి పార్టీలకు ఎవరిని ఎన్ని అంటే ఈ మధ్య దాకా జరిగిన చర్చను బట్టి చూస్తే తెలుగుదేశాని టీడీపీకి రెండు జనసేనకు ఒకటి బీజేపీకి ఒకటి అన్నది ప్రచారంగా సాగుతోంది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఒకటి టీడీపీకి మూడు ఎంపీ సీట్లూ అన్న కొత్త చర్చ సాగుతోంది అని అంటున్నారు.

పోటీ తీవ్రం కావడంతో:

అలా ఎందుకు అంటే ఏపీలో అతి పెద్ద పార్టీ టీడీపీ. ఆ పార్టీలో ఆశావహులు ఎంతో మంది ఉన్నారు. పైగా 2024 ఎన్నికల్లో పోత్తుల కారణంగా చాలా మంది ఎంపీలుగా పోటీ చేయలేకపోయారు. అలాగే చట్ట సభలలోకి కూడా అడుగు పెట్టలేకపోయారు. అలాగే చాలా మందికి సామాజిక ప్రాంతీయ సమతూకం పాటించేందుకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక చూస్తే ఖాళీ అవుతున్న నాలుగు సీట్లలో సానా సతీష్ కి మరోసారి చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళి కేవలం ఏణ్ణర్థం కాలంలోనే పదవిని కోల్పోతున్నారు కాబట్టి రెన్యూవల్ చేస్తారు అని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బీజేపీకి ఇస్తే టీడీపీకి మిగిలేది ఒక్కటే ఎంపీ సీటు. అందుకే టీడీపీ బీజేపీకి ఇవ్వకుండా ఆ రెండు సీట్లను తన వద్దనే అట్టేబెట్టుకుంటే ఆశావహులకు కొంతలో కొంత న్యాయం చేసినట్లు అవుతుందని ఆలోచిస్తోంది అని అంటున్నారు.

బీజేపీ కోటా చూస్తే :

ఇదిలా ఉంటే బీజేపీకి ఇప్పటికే ఈపీ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అందులో ఒకటి తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఇస్తే మరొకటి గోదావరి జిల్లాలకు చెందిన పాకా వెంకట సత్యనారాయణకు ఇచ్చారు. ఇలా కేవలం రెండేళ్ళ కూటమి పాలనలోనే రెండు సార్లు బీజేపీకి అవకాశం దక్కింది కాబట్టి ఈ తడవ నో చాన్స్ అని అంటున్నారు. టీడీపీలో పొజిషన్ టైట్ గా ఉంది కాబట్టి ఈసారికి పెద్దగా అడగవద్దు అని టీడీపీ నుంచే సంకేతాలు కాషాయం పార్టీకి వెళ్తున్నాయని చెబుతున్నారు.

వీరంతా రేసులో :

ఇక ఏపీలో బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్ళేందుకు రేసులో ఉన్న వారిలో తొలి పేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేరు వినిపిస్తోంది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2024లో కూడా ఆయనకు పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బీజేపీ పెద్దల మద్దతు ఉందని రాజ్యసభకు బీసీ నేతగా ఉత్తరాంధ్ర వాసిగా రప్పించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలోనే రాజ్యసభకు వెళ్ళలాని ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. రాజ్యసభకు వెళ్తే కేంద్ర మంత్రి చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా రాయలసీమకు చెందిన బలమైన సామాజిక వర్గం సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఒకరు ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు. ఆయనకు కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నేతల పేర్లు విన వస్తున్నా కూటమి నుంచి ఈసారి నో చాన్స్ అనే అంటున్నారు. చూడాలి మరి చివరి నిముషంలో కేంద్ర బీజేపీ నాయకత్వం గట్టిగా ఒత్తిడి తెస్తే సీన్ మారవచ్చేమో.