Begin typing your search above and press return to search.

చేనేత వస్త్రాలు హాట్ కేకుల్లా...మంత్రులు ఎమ్మెల్యేలు ఫిదా

చేనేత వస్త్రాలకు ఏపీ పెట్టింది పేరు. ఏపీలో అనేక ప్రాంతాలలో చేనేత వస్త్రాలు పెద్ద ఎత్తున తయారు అవుతున్నాయి. వాటికి ఆదరణ కల్పించాలని గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

By:  Satya P   |   26 Feb 2026 6:00 AM IST
చేనేత వస్త్రాలు హాట్ కేకుల్లా...మంత్రులు ఎమ్మెల్యేలు ఫిదా
X

చేనేత వస్త్రాలకు ఏపీ పెట్టింది పేరు. ఏపీలో అనేక ప్రాంతాలలో చేనేత వస్త్రాలు పెద్ద ఎత్తున తయారు అవుతున్నాయి. వాటికి ఆదరణ కల్పించాలని గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అవి ఫలిస్తున్నాయి కూడా. ఇటీవల కాలంలో చేనేత వస్త్రాలను ధరించాలన్న అవగాహన అందరిలో పెరిగింది. పర్యావరణ హితంగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా మేలు మేలు చేస్తాయని భావించి వాటిని ధరించేందుకు ఈనాటి తరం వారు ఆసక్తి చూపిస్తున్నారు.

అసెంబ్లీ వద్ద స్టాల్స్ :

ఇదిలా ఉంటే చేనేత వస్త్రాల స్టాల్స్ ని అసెంబ్లీ ప్రాంగణం వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 20 తేదీన చేనేత స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన ప్రఖ్యాతగాంచిన చేనేత ఉత్పత్తులను ఆ స్టాళ్లలో అమ్మకానికి పెట్టారు. దాంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజా ప్రతినిధులు అంతా అక్కడ ఈ చేనేత వస్త్రాల స్టాల్స్ ని సందర్శిస్తున్నారు. అలాగే ముచ్చట పడి కొనుగోలు చేస్తున్నారు కూడా. దీంతో మంచి ఆదరణ ఈ స్టాల్స్ కి లభిస్తోంది. దీంతో చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి.

అన్ని రకాల బ్రాండ్స్ తో :

ఇక ఈ స్టాల్స్ వద్ద చేనేత ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాలైన బ్రాండ్స్ కూడా ఉంచుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు చేనేత వస్త్రాలని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం విశేషం. ఇక ఈ స్టాల్స్ లో ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రఖ్యాత గాంచిన చేనేత ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం విశేషం. చేనేత రెడీ మెడ్ దుస్తులు సహా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు, మానపల్లి పట్టు, సాధారణ చీరలు కూడా ఈ స్టాల్స్ లో ఉన్నాయి.

మంచి స్పందన అంటూ :

ఇదిలా ఉంటే ఈ శాఖను చూస్తున్న మంత్రి సవిత అయితే అసెంబ్లీలో పెట్టిన చేనేత ఉత్పత్తుల స్టాల్స్ కి మంచి స్పందన లభిస్తోంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం ప్రజా ప్రతినిధులు మాత్రమే కాదు అసెంబ్లీ విధులలో పాల్గొంటున్న ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు సైతం స్టాళ్లలో చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం విశేషం. దాంతో మార్చి 7వ తేదీ వరకూ జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోగా పెద్ద ఎత్తున చేనేత వస్త్రాల విక్రయాలు జరగడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.

సందర్భం బట్టి :

ఇక గతంలో అయితే చేనేత ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చినా వాటిని ఎక్కడి వారు అక్కడే అమ్ముకునే వారు. ఇపుడు ఏ సందర్భం వచ్చినా ఆయా ప్రాంగణాలలో పెద్ద ఎత్తున స్టాల్స్ ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం దాంతో అక్కడికి వచ్చిన సందర్శకులు చేనేత ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల చేనేత మార్కెట్ కి మంచి ఆదరణ ఉంటోంది అని అంటున్నారు.