Begin typing your search above and press return to search.

బొత్స ఉక్కిరిబిక్కిరి.. మండలిలో విపక్ష నేతకు మద్దతు కరువు?

ఏపీలో శాసనమండలి సమావేశాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. విపక్షం వైసీపీకి బలం ఎక్కువగా ఉన్న ఈ సభలో చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Feb 2026 11:00 PM IST
బొత్స ఉక్కిరిబిక్కిరి.. మండలిలో విపక్ష నేతకు మద్దతు కరువు?
X

ఏపీలో శాసనమండలి సమావేశాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. విపక్షం వైసీపీకి బలం ఎక్కువగా ఉన్న ఈ సభలో చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే సభ్యుల బలం ఎక్కువగా ఉన్నా, అధికార పక్షం విమర్శల దాడిని ఎదుర్కోవడంలో విపక్షం విఫలమవుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులుగా శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే విపక్ష నేత బొత్స సత్యానారాయణకు సొంత పార్టీ సభ్యుల నుంచి తగిన మద్దతు లభించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బొత్సతోపాటు ఒకరిద్దరు సభ్యులు మాత్రమే అధికార పక్షంతో ఢీకొట్టేందుకు ముందుకు వస్తున్నారని, వైసీపీ సభ్యుల్లో 90 శాతం మంది మండలిలో కాలక్షేపం చేయడానికే పరిమితమవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టగా, సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అయితే 11వ తేదీన గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించింది. సభకు హాజరైన కొద్దిసేపటికే ఉభయ సభల సమావేశం నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక 12, 13 తేదీల్లో జరిగిన సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య పలు అంశాలపై పెద్ద ఎత్తున సంవాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎదురుదాడి చేయడంతో విపక్షం వైసీపీ వాకౌట్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇలా విపక్షం వాకౌట్ చేయడాన్ని అధికార పక్షం ఎత్తిచూపుతూ అర్థవంతమైన చర్చలు జరిపేందుకు విపక్షాన్ని సభలో ఉండమంటూ సవాల్ విసిరింది.

నిజానికి మండలిలో విపక్షానికే ఎక్కువ మెజార్టీ ఉంది. మొత్తం 58 మంది సభ్యులు ఉన్న మండలిలో విపక్షానికి 34 మంది సభ్యుల బలం ఉంది. అయితే వీరిలో చాలా మంది తమ సామర్థ్యానికి తగినట్లు మండలిలో పనిచేయలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మండలిలో విపక్ష నేత బొత్స సత్తిబాబు ఒక్కరే ఒంటరి పోరాటం చేయాల్సివస్తోందని అంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నా, మిగిలిన సభ్యులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల మెజార్టీ ఉన్నా వైసీపీ వెనక్కి తగ్గాల్సివస్తోందని అంటున్నారు.

మండలిలో జరుగుతున్న చర్చల్లో విపక్ష నేత బొత్స, మహిళా నేత వరుదు కల్యాణి మాత్రమే వైసీపీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారని చెబుతున్నారు. మిగిలిన సభ్యుల్లో కొందరు ప్రశ్నలు అడగడానికే పరిమితమవుతున్నారని అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వైసీపీ ఎమ్మెల్సీలు విఫలమవుతున్నారని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీల్లో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ సభలో సమర్థంగా వ్యవహరించలేకపోవడానికి కారణాలు ఏంటన్నది అర్థం కావడం లేదని వైసీపీ సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలిలో అధికార పక్షానికి కేవలం 13 మంది సభ్యులే ఉన్నారు. వీరితోపాటు దాదాపు పది మంది మంత్రులు క్రమం తప్పకుండా మండలికి హాజరవుతున్నారు. విపక్షం అసెంబ్లీని బహిష్కరించిన నేపథ్యంలో రాజకీయ చర్చలకు మండలి ప్రధాన వేదికగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కువగా మండలి సమావేశాలను వీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ సమర్థంగా వ్యవహరించి ప్రజాభిమానాన్ని చూరగొనే అవకాశం ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీలు ఆ దిశగా పనిచేయలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్సీలకు పార్టీ సరైన దిశానిర్దేశం చేస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.