Begin typing your search above and press return to search.

లోకేష్ సీఎం అయ్యే చాన్స్ ఉందా ?

అయితే ఆనాడు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ కలలు అలాగే ఉండిపోయాయి. ఇపుడు టీడీపీ కూటమి కట్టింది. ఈసారి ఏపీలో అధికారం తమదేనని దృఢ విశ్వాసంతో ఉంది.

By:  Tupaki Desk   |   17 May 2024 2:30 PM GMT
లోకేష్ సీఎం అయ్యే చాన్స్ ఉందా ?
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చంద్రబాబు తరువాత పగ్గాలు చేపట్టాల్సిన వారు. చంద్రబాబుకు అసలైన రాజకీయ వారసుడు. ఇప్పటికే బాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూసిన మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఇక 2019లో టీడీపీ వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు అని అప్పట్లోనే ప్రచారం సాగింది.

అయితే ఆనాడు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ కలలు అలాగే ఉండిపోయాయి. ఇపుడు టీడీపీ కూటమి కట్టింది. ఈసారి ఏపీలో అధికారం తమదేనని దృఢ విశ్వాసంతో ఉంది. దాంతో ఈసారి అధికారంలోకి టీడీపీ వస్తే లోకేష్ ఆశలు తీరుతాయా ఆయన ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చ పార్టీ లోపలా బయటా సాగుతోంది.

ఈసారి ఎన్నికలు లోకేష్ జాతకాన్ని కీలక మలుపు తిప్పుతాయని టీడీపీలో యువ నాయకులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. టీడీపీకి సొంతంగా 105 సీట్లు పైన వస్తే కచ్చితంగా లోకేష్ ని సీఎం గా చేస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు. కూటమి మద్దతు అపుడు అతి కీలకం అవుతుంది. ఒకవేళ కూటమి సీఎం అభ్యర్థిగా లోకేష్ ని ప్రకటిస్తే బీజేపీ జనసేన కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతాయని అంటున్నారు.

బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉంటుంది. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతు ప్రకటించారు అని అంటున్నారు. దాంతో లోకేష్ ని సీఎం చేస్తామంటే ఆ రెండు పార్టీలూ ససేమిరా ఒప్పుకోవు అని అంటున్నారు.

అయితే టీడీపీ వరకూ చూస్తే చంద్రబాబు మూడు సార్లు సీఎం చేశారు. ఆయన తానుగా పదే పదే చెప్పుకున్నట్లుగా ఈ పదవి అన్నది కొత్త కాదు, పైగా బాబు ఈసారి పూర్తి స్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది. లోకేష్ సీఎం అయితే చూడాలన్నది కూడా బాబులో ఆశ ఉంది. అంతే కాదు తన సమక్షంలోనే లోకేష్ ని సీఎంగా చేస్తే అటు పార్టీ కూడా పూర్తిగా లోకేష్ కంట్రోల్ లోకి వస్తుందని మరింత కాలం టీడీపీ మనుగడ సాగించడానికి అది బలమైన పునాది వేసినట్లూ అవుతుందని బాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట.

అంతే కాదు ఈసారి ఎన్నికల వరకూ ఓకే అయినా 2029 ఎన్నికలను ఎదుర్కోవాలి అంటే మాత్రం లోకేష్ ని సీఎం గానే ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు అలా జరగకపోతే పార్టీకి కూడా ఇబ్బంది వస్తుందని అంటున్నారు. టీడీపీకి కూడా చాలా కష్టం అవుతుంది అన్నది ఇంట్లో వాళ్ళ ఒత్తిడిగా చంద్రబాబు మీద ఉంది అని అంటున్నారు.

కేటీఆర్ ని ఉదాహరణ చూపించి మరీ చంద్రబాబు మీద మొత్తం కుటుంబం ఒత్తిడి పెంచుతోంది అని అంటున్నారు. కేటీఆర్ ని కేసీఅర్ తన పదవీ కాలం మధ్యలో సీఎం ని చేయలేకపోయారు. దాంతో ఇపుడు పార్టీ ఏకంగా అధికారానికి దూరం అయింది. మరో అయిదేళ్ల పాటు బీఆర్ ఎస్ అస్తిత్వ పోరాటం చేయాలి. అదే చేతిలో అధికారం ఉన్నపుడే సీఎం గా చేసి ప్రమోట్ చేస్తే ఒక స్థాయి ఉన్న నేతగా కొత్త లుక్ లో జనంలోకి వెళ్ళడానికి లోకేష్ కి అవకాశం ఉంటుంది అన్నది ఫ్యామిలీ మెంబర్స్ మాటగా ఉంది అని అంటున్నారు.

చంద్రబాబు వయసు రీత్యా ఆయన మరో ఎన్నికల దాకా ఇంత దూకుడుగా పార్టీని నడపలేరు అని అందువల్ల లోకేష్ కి ఇప్పటి నుంచే ముందు పెట్టి సీఎం హోదాతో ఆయనను ఉంచితే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని మరో నలభై ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా పార్టీ ఉంటుంది అని అంటున్నారు.

ఇక చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. లోకేష్ విషయం తీసుకుంటే ఆయనకు కనుక చాన్స్ వస్తే అంతకంటే తక్కువ వయసులోనే సీఎం కాగలరని అంటున్నారు. బాబు మూడు దశాబ్దాలుగా పాటీని సీఎం అయ్యాక మోశారు. లోకేష్ సైతం అంతకు మరింత కాలం పార్టీని ముందుకు నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటారని ఆ విధంగా చేయడమే బెస్ట్ అని ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వస్తోందిట.

మొత్తానికి చూస్తే లోకేష్ కి సీఎం యోగం ఉందా లేదా అన్నది బాబు ఆలోచనలు ఆయన వ్యూహాలు బట్టే తెలుస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు తలచుకుంటే కనుక కూటమి పక్షాలను సైతం ఒప్పించి చినబాబుకు పట్టాభిషేకం చేయగలరు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.