ఏడాదిలో సాఫ్ట్‌వేర్ జాబ్‌లు మాయమవుతాయా?
ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ఏఐ ఏజెంట్ డెమో ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
By: A.N.Kumar | 6 Feb 2026 6:37 PM ISTసాఫ్ట్‌వేర్ రంగం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ కుదుపుకు లోనవుతోంది. ఇప్పటివరకు ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీ వంటి మార్పులను చూసిన ఈ రంగం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో అసలైన సవాలును ఎదుర్కోబోతోంది. తాజాగా ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులను, ఇన్వెస్టర్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
6 నుండి 12 నెలల్లోనే ‘ఏఐ’ ఇంజినీర్లు!
డారియో అమోడై అంచనా ప్రకారం.. రాబోయే 6 నుంచి 12 నెలల్లోనే మానవ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల స్థానాన్ని భర్తీ చేయగల అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇది కేవలం కోడింగ్ రాయడానికే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడం.. బగ్స్‌ను తప్పులను గుర్తించి సరిచేయడం.. టెస్టింగ్ , డిప్లాయ్‌మెంట్, నిరంతర మెయింటెనెన్స్ సహా ఈ పనులన్నింటినీ ఒకే ఒక ఏఐ ఏజెంట్ పూర్తి చేయగల స్థాయికి సాంకేతికత చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఐటీ కంపెనీల పనితీరు పూర్తిగా మారిపోనుంది.
కుదేలవుతున్న ఇండియన్ ఐటీ స్టాక్స్
ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ఏఐ ఏజెంట్ డెమో ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ ఐటీ దిగ్గజాల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. "కోడింగ్ చేసే పనిని ఏఐ తక్కువ ధరకే పూర్తి చేస్తే లక్షలాది మంది ఉద్యోగులున్న ఐటీ కంపెనీల పరిస్థితి ఏమిటి?" అన్న భయం మార్కెట్‌ను వెంటాడుతోంది. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎక్కువగా చేరే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మాన్యువల్ టెస్టింగ్, సపోర్ట్ విభాగాల్లో ఉద్యోగ కోత తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎంట్రీ లెవెల్ వైట్‌కాలర్ ఉద్యోగాల్లో 50% కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అమోడై హెచ్చరించారు.
ముగింపు కాదు.. పరివర్తన!
అయితే ఈ మార్పును ఒక ముగింపుగా చూడలేమని డారియో అమోడై అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు శారీరక శ్రమ తగ్గినట్లే ఇప్పుడు ఏఐ వల్ల యాంత్రికమైన కోడింగ్ పని తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. కేవలం కోడ్ టైప్ చేసేవారికంటే సమస్యను విశ్లేషించి పరిష్కారం కనుగొనే ఇంజినీర్లకు డిమాండ్ పెరుగుతుంది.ఏఐ మోడల్స్‌ను శిక్షణ ఇవ్వడం, సిస్టమ్ ఆర్కిటెక్చర్ రూపొందించడం వంటి విభాగాల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.
యువత ఏం చేయాలి?
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ యువత తమను తాము సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐని శత్రువుగా కాకుండా ఒక శక్తివంతమైన టూల్‌గా వాడుకోవడం నేర్చుకోవాలి. ఒకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కు పరిమితం కాకుండా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌పై పట్టు సాధించాలి. మెషిన్ చేయలేని 'ఆలోచన'ను, సృజనాత్మకతను పదును పెట్టుకోవాలి.
డారియో అమోడై వ్యాఖ్యలు ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. ఒక కొత్త యుగానికి నాంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి, ఏఐతో జతకట్టిన వారే ఈ భవిష్యత్ ఐటీ యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు.
