అన్నామలై ‘2.0 అవతార్’.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారం..
తమిళనాడు రాజకీయాలు కోలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అనూహ్య విజయంతో దళపతి విజయం చరిత్ర సృష్టించారు.
By: Tupaki Desk | 1 Jun 2026 11:06 PM ISTతమిళనాడు రాజకీయాలు కోలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అనూహ్య విజయంతో దళపతి విజయం చరిత్ర సృష్టించారు. పాలనలో కొత్త వరవడి సృష్టిస్తూ సీఎం ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు ఆయన చాకచక్యంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. దీంతో విపక్ష పాత్రలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే గతంలో ఎన్నడూ లేనట్లు ఒకే గళం వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు శాఖలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే సంకేతాలు అందుతున్నాయి అంటున్నారు.
ప్రధానంగా రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఫైర్‌బ్రాండ్ లీడర్ కె. అన్నామలై బీజేపీకి టాటా చెప్పేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోందన అంటున్నారు. దీంతో అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఎటువైపు పడబోతోంది? అనేది తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? సొంతంగా పార్టీ పెడుతున్నారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు కారణం మధురై, కోయంబత్తూరులో అన్నామలై 2.0 అన్న పోస్టర్లు వెలియడమే అంటున్నారు.
'2.0 అవతార్' పోస్టర్ల కలకలం
అన్నామలై అనుచరులు మధురై, కోయంబత్తూరు నగరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. "అన్నామలై 2.0 అవతార్" పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో... 'అన్నామలై మరో అవతారం ఎత్తాలని, తమిళనాడును కాపాడాలని' రాసి ఉండటం విశేషం. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకుని సొంత మార్గాన్ని ఎంచుకోబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరిందని అంటున్నారు.
అసంతృప్తికి కారణం ఏంటి?
2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK)తో పొత్తు పెట్టుకోవాలనే బీజేపీ అధిష్ఠానం నిర్ణయం ఆయనకు అస్సలు నచ్చలేదు. కూటమిలో అన్నాడీఎంకే పెద్దన్న పాత్ర పోషించడాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని చెబుతున్నారు. ప్రచారంలోనూ పార్టీ పెద్దలు ఆయనను పెద్దగా పట్టించుకోకపోవడంతో అన్నామలై క్యాంప్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది.
సొంత పార్టీ వైపు అడుగులు?
తాజా పరిణామాల నేపథ్యంలో అన్నామలై త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ తమిళ ప్రాంతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. ఆయన పెట్టబోయే పార్టీ పేరు 'మక్కల్ శక్తి ఇయక్కం' కాబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అన్నామలై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని అంటున్నారు. మరోవైపు బీజేపీతో ఆయనకు గ్యాప్ పెరిగిందనడానికి ఇటీవల ఆయన పెట్టిన ఒక 'ఎక్స్' పోస్ట్ నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని అన్నామలై బహిరంగంగానే వ్యతిరేకించారు. తమిళనాడు విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తక్షణమే త్రిభాషా విధానం నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరారు. బీజేపీలో ఉంటూనే కేంద్ర విధానాన్ని తప్పుపట్టడం ఆయన తిరుగుబాటుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జూన్ 4న క్లారిటీ రానుందా?
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న అన్నామలై.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అపాయింట్‌మెంట్ కోరడం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఈ భేటీ ఎజెండా ఏంటనేది సస్పెన్స్ గా మారింది. కాగా, ఈ నెల 4న అన్నామలై పుట్టినరోజు కావడంతో.. అదే రోజు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై, '2.0 అవతార్'పై ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
