Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాల్లో కొత్త బాణం!

ఈ సమయంలో ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో జాయి అయిపోయారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 1:30 AM GMT
ఏపీ రాజకీయాల్లో కొత్త బాణం!
X

ఏపీ రాజకీయాల్లో "బాణం" అనే పదం చాలా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిళ పాద యాత్ర చేస్తున్న సమయంలో... తాను "జగనన్న వదిలిన బాణాన్ని" అని చెప్పుకున్నారు! అనంతరం జగన్ తో విభేదాలు వచ్చాయని.. ఆమె ఇక ఏపీ రాజకీయాల వైపు రారని కథనాలొచ్చాయి. ఈ సమయంలో ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో జాయి అయిపోయారు. కట్ చేస్తే... ఇప్పుడు ఏపీలో తాను కూడా బాణాన్నే అంటూ ఒక యాక్టర్ తెరపైకి వచ్చారు.

అవును... గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుదారుడిగా ఉండి.. ఫలితంగా ఎస్.వీ.బీ.సీ. ఛైర్మన్ పదవిని పొందిన సినీనటుడు ఫృధ్వీరాజ్... అనంతరం జరిగిన కొన్ని "కీలక" కారణాలవల్ల ఆ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటనకు సంబంధించినవిగా చెప్పే ఆడియోలు వైరల్ గా ఉండేవి! తదనంతర పరిణామాల్లో పార్టీ దూరం పెట్టిందని అనేవారు. ఫలితంగా... ఫృధ్వీ జనసేనలో చేరిపోయారు!

అప్పటి నుంచి వైసీపీ నాయకులపై.. ప్రధానంగా సత్తెనపల్లి సీటు నుంచి పోటీ చేస్తానని తనకు తాను చెప్పుకుంటూ.. అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించేవారు! ఇక "బ్రో" సినిమాలో అంబటి డ్యాన్స్ ను ఇమిటెట్ చేశారు. దీంతో... అంబటి రాంబాబు.. పవన్ ను ఆన్ లైన్ వేదికగా వెంటాడారు. ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాల్లో దానికి కౌంటర్ కూడా ఇచ్చారు! తాను సంబరాల రాంబాబునే అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో తాజాగా స్పందించిన థర్టీ ఇయర్స్ ఫృధ్వీ... తనను తాను ఒక బాణంగా అభివర్ణించుకున్నారు. ఈ సందర్భంగా... షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదని.. అవన్నీ పాత రోజులని.. ఇప్పడు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాణం అని.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే "చంద్రబాబు, పవన్ వదిలిన బాణం పృధ్వీరాజ్" అని అన్నారు.

ఇదే సమయంలో... వచ్చే ఎన్నికల్లో రెండు జెండాల కలయిక విజయం సాధిస్తుందని.. ఇందులో భాగంగా 130 స్థానాలతో టీడీపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏయే ప్రాజెక్టులు ఆగిపోయాయో చెప్పాలని ప్రశ్నించిన ఫృధ్వీ... రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.