Begin typing your search above and press return to search.

లోకేష్, భువనేశ్వరి నిరసన దీక్ష... పవన్ మౌన దీక్ష!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2023 9:17 AM GMT
లోకేష్, భువనేశ్వరి నిరసన దీక్ష... పవన్ మౌన దీక్ష!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. మరో పక్క ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది! దీంతో చంద్రబాబు మూడువారాలకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు తమ నిరసననను తెలుపుతున్నాయి.

అవును... చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ శనివారం సాయంత్రం "మోత మోగిద్దాం" కార్యక్రమం చేపట్టిన టీడీపీ శ్రేణులు... సోమవారం గాంధీ జయంతి సందర్భంగా... "సత్యమేవ జయతే" అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరసన దీక్ష చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా... ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాజమండ్రిలోని క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భువనేశ్వరి.. ఇదే క్రమంలో వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికీ పూలమాల వేశారు.

ఇదే సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నారా లోకేష్ దీక్షకు కూర్చొన్నారు. ఈ దీక్షలో వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంలో పవన్ మౌన దీక్ష:

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన "సత్యమేవ జయతే" దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో... మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంటూ పవన్ కల్యాణ్ దీక్షకు కూర్చున్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో రెండు గంటల పాటు పవన్‌ మౌన దీక్షకు కూర్చున్నారు.

రెండు గంటల మౌన దీక్ష అనంతరం మైకందుకున్న ఆయన... రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందరులో చేసుకుందామని శ్రేణులకు తెలిపారు. గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం చంపేసిందని, రాజకీయాల్లో బురద పడుతుందని తెలిసినా ముందుకే సాగుతామని పవన్ అన్నారు.