Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికలకు తొలి అడుగు....టోటల్ 175 లోనూ...!

ఒక విధంగా ఏపీలో నెమ్మదిగా కేంద్ర ఎన్నికల సంఘం నీడలో నిఘాలో అధికారిక వ్యవస్థ వెళ్లేందుకు ఇది ముందడుగు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 3:58 AM GMT
ఏపీలో ఎన్నికలకు తొలి అడుగు....టోటల్ 175 లోనూ...!
X

ఏపీలో ఎన్నికలకు అధికారికంగా తొలి అడుగు పడింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీల వేడి తప్ప ఎన్నికల సంఘం వైపు నుంచి ఏమీ లేదు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఏపీవ్యాప్తంగా ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

దీంతో ఏపీలో ఎన్నికల ప్రక్రియకు నాంది పలికినట్లు అయింది. ఏపీలో ఇక మీదట ఎన్నికల రిటర్నింగ్ అధికారులే కీలకంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా తప్పుల తడక అంటూ టీడీపీ జనసేన సహా ఇతర రాజకీయ పార్టీలు యాగీ చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వం చేసే తప్పులు వాలంటీర్ల వ్యవస్థ ఆసరాతో ఓటర్లను కొత్తగా చేరుస్తున్నారు అని కూడా ఎండగడుతున్నారు.

ఇపుడు ఆ ఫిర్యాదులు అన్నీ కూడా రిటర్నింగ్ అధికారుల ముందుకు రాబోతున్నాయి. వాటిని ఆర్వోలు ఎక్కడికక్కడ సీరియస్ గా పరిశీలించనున్నారు. తప్పులు ఏమైనా జరిగితే నియోజకవర్గాల దశలోనే అడ్డుకట్ట పడుతుంది. అలా విపక్షాలకు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల విషయంలో సజావుగా జరిగేలా చూడాలని తమ డిమాండ్ ని ముందు పెట్టేందుకు వీలు అవుతుంది.

ఒక విధంగా ఏపీలో నెమ్మదిగా కేంద్ర ఎన్నికల సంఘం నీడలో నిఘాలో అధికారిక వ్యవస్థ వెళ్లేందుకు ఇది ముందడుగు అని అంటున్నారు. అదే విధంగా ఆర్వోల నియామకం అంటే ఇక మీద ప్రభుత్వ విధానాలు నిర్ణయాల మీద నిశిత పరిశీలన కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఇప్పటిదాక ఎన్నికలకు సంబంధిచిన ఫిర్యాదులు అన్నీ కలెక్టర్ స్థాయిలోనే వెళ్లేవి. ఇపుడు ప్రతీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు ఆర్వోలు కళ్లెదుట కనిపిస్తారు.

ఏపీలో ఎన్నికలు ఎపుడు అన్న చర్చ కూడా మరో వైపు ఉంది. వాస్తవానికి చూస్తే ఆగస్ట్ నెల ప్రవేశించింది. ఇంకా ఇక్కడికి అయిదు నెలలు మార్చి 2024 వరకూ అంటే మరో మూడునెలలతో ఎనిమిది నెలలుగా ఉంది. కానీ ఆర్వోల నియామకం జరపడం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విశాఖలో రెండు రోజుల పాటు సమావేశం అయి కీలక చర్చలు జరపడం వంటివి చూస్తే ఎన్నికల వేడి ఈసీ నుంచే మొదలైందా అన్నదే అందరిలో కలుగుతున్న భావనగా ఉంది.

రానున్న రోజులలో ఈసీ మరిన్ని కీలక చర్యలతో ముందుకు సాగనుంది అంటున్నారు. ఈ ఏడాది చివరికి ఈసీ పూర్తిగా ఏపీలో ఎన్నికల వ్యవహారం మీద రంగంలోకి దిగిపోతుంది అని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా ఉన్నది అయిదు నెలలు మాత్రమే అనుకోవాలి. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మరింతగా జనంలోకి పరుగులు తీయాల్సిన అవసరం ఉంది.