Begin typing your search above and press return to search.

దేశ రాజధానిలో ఆసక్తికర పరిణామం.. తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కీలక నిర్ణయం!

కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సాఫీగా ముగిసింది

By:  Tupaki Desk   |   16 July 2025 11:11 PM IST
దేశ రాజధానిలో ఆసక్తికర పరిణామం.. తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కీలక నిర్ణయం!
X

కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సాఫీగా ముగిసింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సాగునీటి సమస్యలపై చర్చించేందుకు కేంద్రం ఈ సమావేశం నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణ, గోదావరి జలాల పంపిణీ, నది జలాల వివాదంపై చర్చించారు. అయితే ఏపీ మాత్రం పోలవరం-బనకచర్లపై సింగిల్ అజెండాతో సమావేశానికి రాగా, తెలంగాణ 13 అంశాలను లేవనెత్తింది. అదేవిధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్లను తిరస్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు.

మరోవైపు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు సుదీర్ఘంగా ఇబ్బంది పడుతున్న నదీ జలాల సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కృష్ణ, గోదావరి జలాల వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీలోగా ఈ కమిటీ ఏర్పాటు కానుంది. అదేవిధంగా హైదరాబాదులో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణ బోర్డు ఉండేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు రిజర్వాయర్ల నీటి ప్రవాహాలను గుర్తించేనలా టెలిమెట్రి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ భేటీకి ఉభయ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. దీంతోపాటు ఆయాశాఖల ముఖ్య అధికారులు వచ్చారు. రాజకీయంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఈ భేటీ అత్యంత ప్రాధాన్యంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శల దాడి నుంచి తప్పించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నేత చంద్రబాబు రాజకీయ చాణక్యం నుంచి ఆయన ఎలా బయటపడతారని అంతా ఆసక్తిగా గమనించారు. కానీ, ఇద్దరూ ఇద్దరే అన్నట్లు సమావేశాన్ని సాఫీగా ముగించారు.

సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై ఆరా తీశారు. సీఎంలు ఇద్దరు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపేట ఈ సమావేశంలో సమీక్షించారు. అనంతరం జరిగిన సమన్వయ సమావేశంలో గోదావరి-బనకచర్ల అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది. సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వినియోగిస్తామని వివరించింది. ఈ సందర్భంగా గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను తెలియజేసింది. ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా తమ చర్యలను తెలంగాణ, కేందర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అభ్యర్థించింది.

కాగా, సమావేశంలో తెలంగాణ 13 అంశాలను ప్రతిపాదించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు ఇవ్వాలని కోరింది. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి అని డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాంతంలో ప్రారంభించిన కృష్ణ ప్రాజెక్టులపై ట్రైబ్యునల్ లో మద్దతు ఇవ్వాలని ఏపీని కోరింది. కృష్ణ నదీ జలాలను వేరే ప్రాంతానికి తరలించకుండా కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని, కృష్ణ జలాల తరలింపును అడ్డుకునేలా టెలిమెట్రిలను ఏర్పాటుకు ఏపీ అంగీకరించాలని కోరింది. ఇలా మొత్తం 13 అంశాలపై కేంద్రం నుంచి అనుమతులు, ఏపీ నుంచి సహకారం ఆశిస్తున్నట్లు తెలంగాణ అధికారులు నివేదించారు.