Begin typing your search above and press return to search.

వచ్చే వేసవి మామూలుగా ఉండదు.. హైరిస్క్ జోన్ లో ఏపీ!

రానున్న వేసవి కాలంలో ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2026 5:13 PM IST
వచ్చే వేసవి మామూలుగా ఉండదు.. హైరిస్క్ జోన్ లో ఏపీ!
X

రానున్న వేసవి కాలంలో ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా వడగాల్పులు ప్రజలకు నరకం చూపే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో పది రాష్ట్రాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పది జిల్లాల్లో ఏపీ 8వ స్థానంలో ఉండటం భయపెడుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు తీవ్ర ఎండ ప్రభావిత జాబితాలో ఉన్నట్లు సమాచారం. దీనిప్రభావంతో జనజీవనం తీవ్ర అవస్థలు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. వేడి తీవ్రత వల్ల వడదెబ్బ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయం, ఆరు బయట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎండల తీవ్రత వల్ల వీరు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

దేశంలో 23 రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రాష్ట్రాల్లో నివసిస్తున్న వంద కోట్ల మంది ఆరోగ్యంపై వడగాలులు ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. గత 40 ఏళ్లలో వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోందని వాతావరణ శాస్ర్తవేత్తలు వివరిస్తున్నారు. దీంతో దేశంలో గత పదేళ్లలో నాలుగు సార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు. 2013, 2016, 2019, 2024ల్లో రికార్డు స్థాయిల్లో వడగాల్పులు వీచినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రధానంగా వాతావరణ మార్పులకు ఎల్ నినో, లానినా కారణం అవుతుంటాయి. ఈ ఏడాది లానినా ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు మరింత భయపడుతున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో అర్బన్ హీట్ ఐలాండ్ కారణంగానూ వేడి ఎక్కువవుతోందని చెబుతున్నారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాల్లో వెచ్చటి రాత్రులు పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. దీనివల్ల పగటిపూట ఎండ తీవ్రతతో అల్లాడిపోయే ప్రజలకు రాత్రి సమయంలోనూ ఉపశమనం లభించడం లేదని అంటున్నారు. ఇక గత ఏడాది దేశంలో 734 జిల్లాలకు సంబంధించిన హీట్ ఇండెక్స్ చూస్తే మన రాష్ట్రం హై రిస్క్ జోన్ లో ఉందని అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం 10 జిల్లాలలో వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించగా, అందులో ఏపీ 8వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.

రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు తీవ్రమైన వేడి ప్రభావానికి గురికానున్నట్లు అంచనా వేస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) విడుదల చేసిన హీట్ హైరిస్క్ ఇండెక్స్ ప్రకారం ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అత్యంత ప్రమాదకరమైన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు ప్రమాదకర కేటగిరిలో ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో క్లైమేట్ హజార్డ్స్ అండ్ వల్నరబులిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా ప్రకారం 1969-2019 మధ్య రాష్ట్రంలో వెయ్యి రోజులు వడగాలులు వీచాయని చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.