ఒక్కరోజుకే విజయోత్సవం.. బాబు కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో విజయోత్సవం పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి, విశాఖ, తిరుపతిలో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
By: Garuda Media | 11 Jun 2026 12:30 PM ISTరాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 2024, జూన్ 12న సీఎం గా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ నెల 12 నాటికి కూటమి ప్రభుత్వంరెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవం పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి, విశాఖ, తిరుపతిలో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
వాస్తవానికి ఈ నెల 9నే తిరుపతి సభ నిర్వహించాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగి.. పలువురు మృతి చెందారు. దీంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తర్వాత.. ఈ నెల 19న విశాఖలో నిర్వహించే కార్యక్రమాన్నికొనసాగించాలని భావించారు. కానీ, దీనిని కూడా రద్దు చేసుకున్నారు. ఈ నెల 12న తిరుపతిలోనే సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీనాయకులు, అధికారులకు కీలకదిశానిర్దేశం చేశారు. మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని అనుకున్నా.. ఒక్క ప్రాంతానికే పరిమితం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖలో విషాదం.. అమరావతిలో పనులు జరుగుతున్ననేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సభలను పక్కన పెట్టాలని.. తిరుపతి సభను గ్రాండ్‌గా నిర్వహించాలని తేల్చి చెప్పారు. దీనిపై అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రం వరకు..
తిరుపతిలో శుక్రవారం నిర్వహించనున్న కూటమి విజయోత్సవ సభకు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు దాదాపు 250 మంది ముఖ్యనాయకులు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బెంగాల్ సీఎం సుబేందు అధికారి .. సహా.. ఇతర ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పాయి. అలానే రాష్ట్రానికి, కేంద్రానికి చెందిన బీజేపీ అగ్రనాయకులు కూడా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన పనులు.. ఇచ్చిన సంక్షేమం.. అమలు చేస్తున్న పథ కాలు.. ఇలా అన్ని విషయాలను ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. ఈ సభను సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండేళ్ల కాలంలో సూపర్ సిక్స్ అమలు, మంత్రివర్గ పనితీరు, అభివృద్ధి, పెట్టుబడుల, ఉద్యోగాల కల్పన వంటివాటిని హైలెట్ చేయనున్నారు.
