చిన్న లాజిక్ మిస్సై.. ఇలా ఇరుకున పడ్డారు...!
తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న వార్డుల విభజన విషయం కూడా.. ఇలానే ఇరుకున పడింది.
By: Garuda Media | 1 Jun 2026 5:00 PM ISTలాజిక్.. లాజిక్కే. అది ఎక్కడైనా.. ఎప్పుడైనా కూడా.. మిస్సయితే ఇబ్బందులు తప్పవు. లాజిక్ మిస్ చేసుకున్న వాళ్లు.. ఎప్పుడూ ఇరకాటంలో పడిన సందర్భాలే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న వార్డుల విభజన విషయం కూడా.. ఇలానే ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దులు విభజించే పరిస్థితి ఇప్పుడు లేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జనగణన జరుగుతోంది. దీంతో రాష్ట్రాల్లో అయినా..దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో అయినా.. సరిహద్దులను మార్చేందుకు వీలు పడదు.
ఈ విషయంపై ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర గణాంకశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. సరిహద్దులు మార్చేందుకు అవకాశం లేదని.. ఎక్కడా కూడా.. మార్చవద్దని పేర్కొంది. దీంతోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా.. 2027-28 మధ్యకు వెళ్లిపోయింది. అయితే.. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు అధికారులు అత్యుత్సాహానికి పోయారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అంశాన్ని తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి ఈ విభజన చేపట్టాలని గత ఏడాదే ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే.. అధికారుల తాత్సారంతో పాటు.. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను మరిచిపోయినట్టుగా వ్యవహరించారు. ఫలితంగా ఇప్పుడు వార్డుల విభజన చేపట్టారు. అయితే.. దీనికి హైకోర్టు బ్రేక్ ఇచ్చేసింది. ఒకవైపు కేంద్ర ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది. వార్డుల విభజన విషయం లో రాష్ట్ర వాప్తంగా కొంత మేరకు పరిస్థితి పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. విశాఖపట్నం గ్రేటర్ కార్పొరేషన్ లోను, మచిలీపట్నం మునిసిపాలిటీలోనూ ఇది వివాదానికి దారితీసింది.
తమకు అనుకూలంగా ఉన్న వార్డులను తొలగించి.. విలీనం చేస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆ రెండు అంశాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు తీసుకున్నహైకోర్టు వార్డుల విభజన పై స్టే విధించింది. అయితే.. ఇది ఆ రెండు నగరా లకే పరిమితమైనా.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వార్డుల విభజనపై ఇది ప్రభావం చూపిస్తుంద ని చెబుతున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయకులు మరిన్ని పిటిషన్లు దాఖలు చేయనున్నారు. మొత్తంగా చిన్న లాజిక్‌ను మిస్ అయిన నేపథ్యంలో పెద్ద సమస్యను తెచ్చుకున్నారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.
