వినాయకచవితి వేళ బాబు సరే.. పవన్.. జగన్ ఎక్కడ?
దీనికి ముందు విభజన నాటి నుంచి ఏపీకి ఎదురవుతున్న విచిత్ర పరిస్థితి గురించి మాట్లాడుకుంటే.. విషయ తీవ్రత అర్థమవుతుంది.
By: Garuda Media | 15 Sept 2026 1:00 PM ISTవినాయచవితి పండుగ పూర్తైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ వేడకలా సాగింది. ఎలినినో పుణ్యమా అని సరిగా వర్షాలు లేని పరిస్థితుల్లో పండక్కి ముందు రోజు ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం (పండుగ రోజు) తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఇదంతా పక్కన పెడితే.. ఏపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు వినాయకచవితి రోజు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
దీనికి ముందు విభజన నాటి నుంచి ఏపీకి ఎదురవుతున్న విచిత్ర పరిస్థితి గురించి మాట్లాడుకుంటే.. విషయ తీవ్రత అర్థమవుతుంది. విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాపం వెంటాడుతోంది. దేశంలో మరే రాష్ట్రానికి లేని పరిస్థితులు ఏపీలో కనిపిస్తాయి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ అధినేతలు తమ సొంత రాష్ట్రంలో ఉండే కన్నా.. పరాయి గడ్డ మీద ఎక్కువగా గడపటం కనిపిస్తుంది. కారణం ఏమైనా సరే.. తాము పాలించే.. తమకు రాజకీయ అవకాశాలు మెండుగా ఉన్న గడ్డను వదిలేసి.. వేరే చోట ఉండటం దేనికి నిదర్శనమన్నది ప్రశ్న.
2014లో రాష్ట్ర విభజన తర్వాత పాలన మొత్తం పరాయి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచే సాగింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పాలన సాగించినట్లు చెప్పుకోవటం తెలిసిందే. కట్ చేస్తే.. కొంతకాలానికి ఓటుకు నోటు వివాదంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీకి తరలిరావటం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన హైదరాబాద్ - విజయవాడ అన్న రీతిలోనే పాలన సాగించారు. అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరబాద్ - బెంగళూరు - విజయవాడ షటిల్ సర్వీసులు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ - విజయవాడ షటిల్ సర్వీసులే.
తర్వాతి కాలంలో వైఎస్ జగన్ అధికారంలోకి రావటం.. సీఎం హోదాలో ఉన్నన్ని రోజులు ఆయన తాడేపల్లిలోని తన సొంత నివాసం నుంచే పాలన సాగించారు. వీలైనంత ఎక్కువగా తాడేపల్లి నివాసంలోనే ఉండేవారు. అదే సమయంలో నాటి విపక్షనేతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువ సమయం గడిపేవారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ - విజయవాడ షటిల్ సర్వీసులు చేశారు. జనసేనాని సైతం ఇదే పరిస్థితి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వేళ.. కూటమి సర్కారు ఏపీలో కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా మరోసారి పదవీబాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. వారంలో ఎక్కువ రోజులు అమరావతిలో ఉంటున్నప్పటికి.. వారాంతంలో.. సెలవులు వస్తే మాత్రం హైదరాబాద్ కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటిలానే అమరావతి - హైదరాబాద్ షటిల్ సర్వీసులు చేస్తున్నారు. అయితే.. గతంతో పోలిస్తే కాస్త మార్పు వచ్చిన పరిస్థితి. కాకుంటే.. ఆయన ఆరోగ్య సమస్యలు.. ఇతర వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ లో ఉండటం కనిపిస్తుంది.
వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే ఆయన తాడేపల్లి - బెంగళూరు అన్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. వినాయకచవితి రోజున ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం ఆసక్తికరంగా కనిపిస్తుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఏపీలో కాకుండా హైదరాబాద్ కు వెళ్లటమేమిటన్న విమర్శల తీవ్రతను చంద్రబాబు గుర్తించినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఉదయం తాడేపల్లిలోని తన నివాసంలో వినాయకచవితి పూజను పూర్తి చేసి.. ఆ తర్వాత హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లారు. అంటే.. పండుగ రోజు పూర్తిగా ఏపీలో లేరన్నమాట.
సీఎం చంద్రబాబు పరిస్థితి కొంతలో కొంత బెటర్. మరింత ఆసక్తి కలిగించేది ఉప ముఖ్యమంత్రి పవన్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిల విషయం. మీడియాలోకానీ సోషల్ మీడియాలో కానీ వినాయకచవితి రోజున ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నారన్న విషయంపై ఎలాంటి సమాచారం లేకపోవటం ఆసక్తికరంగా చెప్పాలి. పండుగ వేళ.. ఈ ఇద్దరు అధినేతలు ఎక్కడ ఉన్నారన్న దానిపై క్లారిటీ లేకపోవటం చూస్తే..కచ్ఛితంగా తాడేపల్లిలో లేరా? అన్నది ఇప్పుడు ప్రశ్న. లాజిక్ గా చూస్తే.. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వినాయకచవితి వేడుక నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయే కానీ.. దానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారన్న సమాచారం లేదు. ఇక.. పవన్ విషయానికి వస్తే.. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం బయటకురాని పరిస్థితి. ఇలాంటి వేళ.. మదిలో మెదిలో మాట ఒక్కటే. ఒకవేళ పండుగ వేళ ఈ ఇద్దరు అధినేతలు ఏపీలో ఉండి ఉంటే.. దానికి సంబంధించిన సమాచారం వార్తల రూపంలో బయటకు వచ్చేది కదా? అలా రాలేదంటే.. ఈ ఇద్దరు నేతలు ఏపీలో లేనట్టా?
