Begin typing your search above and press return to search.

లిటిల్ కొరియాగా రాష్ట్రం.. చంద్రబాబు, లోకేశ్ సరికొత్త ప్లాన్!

భారీ పెట్టుబడులతో ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చాలని చూస్తున్న ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచిస్తోందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2026 9:07 AM IST
లిటిల్ కొరియాగా రాష్ట్రం.. చంద్రబాబు, లోకేశ్ సరికొత్త ప్లాన్!
X

భారీ పెట్టుబడులతో ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చాలని చూస్తున్న ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచిస్తోందని అంటున్నారు. ప్రధానంగా రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ ‘కియా మోడల్’ను అమలు చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. 2019కి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలతో నాటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధితోపాటు భాష, కమ్యూనికేషన్లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రస్తుతం సత్యసాయి జిల్లా పరిధిలోని పెనుకొండలో కియా పరిశ్రమ స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ కార్ల ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిన కియా పరిశ్రమకు అనుబంధంగా పెనుకొండ పరిసరాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. ఎత్తైన అసెంబ్లీ ప్లాంట్లు, మెటల్-షీట్ గిడ్డంగులలో ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్స్, ఫోర్క్‌లిఫ్ట్‌లతో అత్యాధునిక ఆటోమేషన్ టెక్నాలజీతో ఇక్కడ కార్ల ఉత్పత్తి జరుగుతోంది.

ఒకప్పుడు ఎక్కడ చూసినా రాళ్లు, రప్పలు, ఎండిపోయిన పొదలతో నిండిన భూభాగం ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులు, రవాణా సిబ్బందితో నిత్యం కళకళలాడుతోంది. 2017లో 'కియా మోటార్స్' ప్రారంభంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయిందని అంటున్నారు. పెనుకొండతోపాటు గుడిపల్లి, అమ్మవరుపల్లి ప్రాంతాల్లో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంట్ దేశంలో కియా ప్రధాన తయారీ కేంద్రంగా వర్ధిల్లుతోంది. ప్రతిరోజూ ఏకంగా 8 వేలకు పైగా అత్యాధునిక కార్లు రూపుదిద్దుకుంటూ దేశీయ మార్కెట్ తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఇక కియా పారిశ్రామిక అభివృద్ధితో పెనుకొండ రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడ స్థానిక తెలుగు సంస్కృతి, దక్షిణ కొరియన్ జీవనశైలి అద్భుతంగా కలిసిపోయాయి. ఒకప్పుడు కరువు నేలగా వెనకబడిన ఈ ప్రాంతం, ఇప్పుడు కొరియన్ ఉద్యోగులు, ఇంజనీర్లు, స్థానిక యువతతో నిత్యం సందడిగా కనిపిస్తోంది. స్థానిక యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో ఈ ప్రాంత ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పెనుకొండలో కియా సాధించిన ఈ అద్భుత విజయాన్ని అక్కడి పారిశ్రామిక వాతావరణాన్ని ఒక రోల్‌మోడల్‌గా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే నమూనాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని నయా ప్లాన్ రచిస్తోందని చెబుతున్నారు.

ప్రధానంగా దక్షిణ కొరియాకు చెందిన పలు పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉండటంతో రాష్ట్రాన్ని లిటిల్ కొరియాగా మార్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొరియాలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీల అధిపతులతో లోకేశ్ భేటీ అయ్యారు. దీంతో షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్, షూఆల్స్, మోటివ్‌లింక్ అండ్ సునిక్ సిస్టమ్స్, బూయంగ్ గ్రూప్, బీఎన్‌కే ఫైనాన్షియల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయని అంటున్నారు. ఇదే సమయంలో కొరియన్ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా స్థానిక యువతను సిద్ధం చేయడం, కొరియన్ భాష, వర్క్ స్టాండర్డ్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా రాష్ట్రంలో అటు విశాఖ నుంచి ఇటు నెల్లూరు, తిరుపతి, కుప్పం వరకు కొరియన్ కంపెనీలు, ఆ దేశానికి చెందిన ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రం ఒక లిటిల్ కొరియాగా రూపాంతరం చెందుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.