Begin typing your search above and press return to search.

కూటమి సర్కార్ మీద ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు ?

రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా మారడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు అని అంటారు.

By:  Tupaki Desk   |   8 May 2025 5:00 AM IST
Are Andhra Employees Losing Faith in the New Government Already?
X

రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా మారడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు అని అంటారు. చరిత్ర కనుక చూస్తే ఇదే సత్యం అని కూడా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా మూడున్నర దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉంటారు. అంటే వారి సర్వీస్ కాలంలో ఏడు నుంచి ఎనిమిది దాకా సార్వత్రిక ఎన్నికలను చూస్తారు.

ఇక వారు ప్రభుత్వంలో కీలకమైన భాగం. వారు తలచుకుంటే ఎవరైనా రాజు అవుతారు. అలాగే తరాజులు కూడా అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఎన్నికకూ ఒకసారి తమ రాజకీయ విధానాలను మార్చుకుంటారు అని చెబుతారు. అలాగే జరుగుతోంది కూడా.

ఉమ్మడి ఏపీలో చూస్తే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ మాత్రమే రాజకీయ ప్రత్యర్ధులుగా ఉండేవి. ఈ రెండు పార్టీలను ఎంచుకుంటూ తడవకో పార్టీని ఉద్యోగులు అధికారంలోకి తెచ్చారు. అయితే 1994 నుంచి 2004 దాకా రెండు సార్లు టీడీపీ వస్తే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉంది. ఇది ఒకింత మార్పుగా చూడాలి.

విభజన ఏపీలో చూస్తే ఒకసారి టీడీపీ 2014 ఉద్యోగుల మద్దతుతో గెలిచింది అని చెబుతారు. 2019లో సీపీఎస్ రద్దు అన్న హామీతో వైసీపీని గెలిపించారు అని అంటారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం వెనక ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉంది అని ప్రచారంలో ఉన్న మాట.

ఇవన్నీ పక్కన పెడితే కూటమి పాలనకు ఏడాది కాలం అవుతోంది. ఇంకా నాలుగేళ్ళ పాటు సమయం ఉంది. ఇంతలోనే ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఇలా ఎందుకు అంటే కొంతమంది మాజీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తాజాగా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులలో కూటమి ప్రభుత్వం తీరు పట్ల మార్పు వచ్చిందని చెబుతున్నారు.

అంటే వారిలో మెల్లగా అసంతృప్తి మొదలైందని, అది మరింతగా పెరుగుతుందని వారు అంటున్నారు. వారందరినీ వైసీపీ వైపుగా మళ్ళిస్తామని చెబుతున్నారు. ఇక వైసీపీకి అనుబంధంగా ఉన్న ఎంప్లాయిస్ పెన్షనర్స్ వింగ్ ను బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తామని అంటున్నారు. అలాగే రాష్ట్రం కోసం ప్రజల కోసం జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు, ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము కృషి చేస్తామని ఈ మాజీ ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు.

అంతే కాదు మళ్ళీ వైసీపీని అధికారంలోకి తెస్తామని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులలో ఇంతలోనే అంత మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. అయిదేళ్ళ వైసీపీ పాలనలో తాము నానా రకాలైన ఇబ్బందులు కడగండ్లూ పడ్డామని ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు చెబుతూనే ఉన్నారు.

ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని వారు కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. ఇక ప్రతీ నెలా జీతాలు కూడా అందని పరిస్థితి వైసీపీ ఏలుబడిలో ఉందని అప్పట్లో ఉద్యోగులు అంతా తీవ్రంగా వేదన చెందారు అని అంటారు. అంతే కాదు తనకు ఏ రకమైన ఆర్ధిక ప్రయోజనాలు కానీ డీఏలు కానీ ఇతరత్రా కానీ దక్కలేదని అంటారు. ప్రత్యేకించి సీపీఎస్ రద్దు చేయలేదన్న తీవ్ర ఆగ్రహం వారిలో ఉంది. అది హామీ ఇచ్చి వమ్ము చేశారు అని అంటారు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతీ నెలా జీతాలు పడుతున్నాయి. ఇది వారికి ఒక విధంగా మేలు జరిగేలా ఉంది. అయితే కొత్త పీఆర్ సీ కోసం వారు అడుగుతున్నారు. ఈసారి 40 శాతం ఫిట్ మెంట్ అయినా ఉండాలని భావిస్తున్నారు. వాయిదా వేసిన కరవు భత్యాన్ని పూర్తిగా విడుదల చేయాలని ప్రతీ ఆరు నెలలూ ఠంచనుగా డీఏలను ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే తమకు అన్ని విధాలుగా ప్రయోజనకరమైన తీరులో హామీలు తీర్చాలని వారు అంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర అవుతున్నా కొత్త పీఆర్సీ కోసం కమిటీని ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్ధిక ప్రయోజనాలు కూడా పెద్దగా లేవు. దాంతో వారిలో కొంత మేర అసంతృప్తి ఉంది అని అంటున్నారు.

అంత మాత్రం చేత వైసీపీ మీద ప్రేమ కానీ మొగ్గు కానీ లేదని కూడా చెబుతున్నారు. అయితే వైసీపీలో చేరిన వారు అంతా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నపుడు అనుకూలంగా చేసిన వారే అని అంటున్నారు. అందువల్ల వారు అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. చూడాలి మరి వైసీపీలో చేరిన ఈ మాజీ సర్కార్ ఉద్యోగులు ఏ రకమైన మార్పు తీసుకుని వస్తారో.