Begin typing your search above and press return to search.

రేపు ఏపీ ప్రభుత్వానికి అత్యంత కీలకం

గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది.

By:  Tupaki Desk   |   2 April 2025 11:14 AM IST
రేపు ఏపీ ప్రభుత్వానికి అత్యంత కీలకం
X

గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. రోజు వారీ కార్యకలాపాలతోపాటు ఎన్నికల హామీల అమలుకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు వెల్లడించారు. అయినప్పటికీ సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని సీఎం చెబుతున్నారు. మరోవైపు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం నిధులు ఇస్తున్నా, వాటిని ఇతర పథకాలకు మళ్లించకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆర్థిక సమస్యలను మెల్లిగా నెట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు అప్పులు చేయాల్సివస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా సెక్యూరిటీలను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 3 గురువారం నాడు ఆర్బీఐలో వేలానికి వస్తున్న ఈ బాండ్ల ద్వారా ఏపీ ప్రభుత్వం దాదాపు 5,750 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తోంది.

రిజర్వు బ్యాంకులో ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.5,750 కోట్లను సమీకరించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం రేపు ఏప్రిల్ 3వ తేదీన బిగ్ డేగా భావిస్తోంది. ప్రస్తుతానికి పింఛన్లు, జీతాలకు నిధులు సమకూర్చుకున్న ప్రభుత్వం ఇతర అవరసరాల కోసం నిధుల వేట మొదలుపెట్టింది. రిజర్వు బ్యాంకు ద్వారా రూ.5,750 కోట్లు సమీకరిస్తే ఏప్రిల్ నెల సాఫీగా గడిచిపోతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గురువారం జరిగే వేలంలో రూ.1,400 కోట్లకు ఒకటి, రూ.1,350 కోట్లకు మరోక సెక్యూరిటీని వేలానికి పెట్టింది. అదేవిధంగా వెయ్యి కోట్ల చొప్పున మరో రెండు సెక్యూరిటీలను ఆర్బీఐ ముందు ఉంచింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యుషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట జరగనుంది.

ఈ నిధులతో కూటమి ప్రభుత్వం ఏ మేం చేస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది. ఇందులో మహిళలకు ఉచిత గ్యాస్, సామాజిక భద్రతా పెన్షన్లను అమలు చేస్తోంది. అయితే కీలకమైన తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలను వచ్చే నెలలో అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో నిధుల వేట ఆడుతున్న ప్రభుత్వం ఆయా పథకాల కోసం రుణాలు చేయాల్సివస్తోందని అంటున్నారు.