Begin typing your search above and press return to search.

కోవిడ్-19 అలారం.. దేశవ్యాప్తంగా 339 కేసులు, ఏపీలో నలుగురి మృతి, హైఅలర్ట్!

అయితే ఈ వ్యాధి లక్షణాలతో నలుగురు మరణించడంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి కేసులు అదుపులో ఉన్నాయని, భయపడాల్సిన అవసరమేమీ లేదని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.

By:  Tupaki Political Desk   |   17 July 2026 12:26 PM IST
కోవిడ్-19 అలారం.. దేశవ్యాప్తంగా 339 కేసులు, ఏపీలో నలుగురి మృతి, హైఅలర్ట్!
X

దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ సైరన్ మోగించింది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా 339 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు అవగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్, ఢిల్లీ, రాజస్థానల్లో సుమారుగా 20 కేసులు వెలుగు చూశాయి. ఇక ఏపీలో ప్రస్తుతానికి 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలతో నలుగురు మరణించడంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి కేసులు అదుపులో ఉన్నాయని, భయపడాల్సిన అవసరమేమీ లేదని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.

రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు మళ్లీ వెలుగుచూడటం, నలుగురు మృతి చెందారన్న వార్తలపై ప్రజలు ఆందోళన చేస్తున్నారు. జూన్ 26 - జులై 16 మధ్య కాలంలో రాష్ట్రంలో మొత్తం 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ అధికారికంగా ప్రకటించారు. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఇవన్నీ వేర్వేరు మండలాలు, ప్రాంతాల్లో నమోదైనవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే చోట గుంపులుగా బయటపడలేదని, బాధితుల్లో ఇద్దరు గతంలో కోవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిగా గుర్తించారు. దీంతో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెబుతున్నారు.

నలుగురు మృతి

కోవిడ్ బారిన పడిన 12 మందిలో నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. మరణించిన నలుగురిలో కడప జిల్లాకు చెందిన వారు ముగ్గురు, కాకినాడకు చెందిన వారు ఒకరు ఉన్నారు. వీరందరికీ కోవిడ్ సోకకముందే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ కారణంగానే వారు మరణించారని వైద్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.

పుణెకు నమూనాలు.. వైరస్ జన్యు విశ్లేషణ

వైరస్ తీవ్రత, జన్యు స్వరూపాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జులై 9న 5 నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపామని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన 67 పరీక్షల్లో 11 పాజిటివ్‌గా తేలగా, కాకినాడకు చెందిన మరొకరికి తమిళనాడులోని వెల్లూరు సీఎంసీలో నిర్వహించిన పరీక్షలో వైరస్ నిర్ధారణ అయ్యింది.

ప్రజలు ఆందోళన చెందవద్దు

రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామని, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.