Begin typing your search above and press return to search.

విశాఖలో మరో మృగాడు.. మూడేళ్ల బాలికపై ఘోరం!

ఏపీలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు శవమై తేలిన రోజే విశాఖలో ఘోరం బయటపడింది.

By:  Tupaki Desk   |   19 Feb 2026 12:48 PM IST
విశాఖలో మరో మృగాడు.. మూడేళ్ల బాలికపై ఘోరం!
X

ఏపీలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు శవమై తేలిన రోజే విశాఖలో ఘోరం బయటపడింది. మూడేళ్ల చిన్నారికి బిస్కెట్లు కొంటానని తీసుకెళ్లి దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విశాఖలోని న్యూపోర్టు పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. వరుస ఘటనలతో ఏపీలో ఆడబిడ్డల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పసిపిల్లలపై పైశాచికం ప్రదర్శిస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. విశాఖలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విశాఖలో మూడేళ్ల చిన్నారిపై ఎరిపిల్లి యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బిస్కెట్లు కొని ఇస్తానని తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. అనంతం ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక ఏడుస్తుండటంతో తల్లి గమనించి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలియజేసింది. అందరూ కలిసి న్యూపోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది. బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటువంటి ఘటనే తీవ్ర సంచలనం రేపింది. ఆ ఘటన మరువ ముందే విశాఖలో మరో ఘోరం బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

బాలికల రక్షణకు కఠిన చట్టాలు ఉన్నా, ఇలాంటి దురాగతాలు వరుసగా చోటుచేసుకుంటుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నిందితుడు గంజాయి మత్తులో దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిందితుడు మరణం తర్వాత అతడి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించినట్లైందన్న చర్చ జరుగుతున్నా, ఇక్కడ నేరం జరగడానికి దారితీసిన పరిస్థితులపైనా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

జిల్లా కేంద్రమైన మదనపల్లెలో గంజాయి విచ్చలవిడిగా లభించడమే ఈ ఘటనకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా విశాఖలోనూ దుండగుడు మత్తులోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడని అంటున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకంపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి గంజాయి సాగు, రవాణాపై నిఘా కట్టుదిట్టం చేశామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయినప్పటికీ మదనపల్లెలో చోటుచేసుకున్న ఘటనకు గంజాయి కారణమన్న సమాచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఇష్యూలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని కేసు క్లోజ్ చేయకూడదన్న డిమాండ్ వినిపిస్తోంది. నిందితుడికి గంజాయి సరఫరా చేసిన వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలని ప్రజలు కోరుతున్నారు.