బిగ్ బాస్ అరెస్టు అప్పుడేనా.. ఆగస్టులో పెను సంచలనం?
ఆగస్టు అంటే ఏపీలో ఎప్పుడూ ఏదో సంచలనం నమోదవుతూనే ఉంటుంది. ‘ఆగస్టు సంక్షోభంపై అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి.
By: Tupaki Desk | 21 July 2025 6:00 PM ISTఆగస్టు అంటే ఏపీలో ఎప్పుడూ ఏదో సంచలనం నమోదవుతూనే ఉంటుంది. ‘ఆగస్టు సంక్షోభంపై అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి. ముఖ్యంగా టీడీపీకి ఆగస్టు సెంటిమెంటు ఎక్కువ. ముఖ్యమంత్రి చంద్రబాబు 1995లో ఆగస్టులోనే తిరుగుబాటు చేసి తొలిసారి సీఎం అయ్యారు. అలా ఆయనకు ఆగస్టు కలిసివచ్చే నెలగా చెబుతారు. ఇక ఇప్పుడు కూడా ఆగస్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు కలిసివచ్చిన ఆగస్టు నెలలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని కటకటాల్లో పెట్టే వ్యూహాన్ని సీఎం చంద్రబాబు సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే నెలలో రాష్ట్రంలో పెను రాజకీయ సంచలనం నమోదు అవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న సిట్.. రెండు రోజుల క్రితం తొలి చార్జిషీటును దాఖలు చేసింది. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్టు అయి 90 రోజులు కావస్తున్నా, ముందు జాగ్రత్తగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా సిట్ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే మరో 20 రోజులు గడువుతో రెండో చార్జిషీటు సమర్పిస్తామని కోర్టుకు నివేదించింది సిట్. ఇక తొలి చార్జిషీటులో కొందరు ముఖ్యల పాత్రను ప్రస్తావించడంతోపాటు నిందితులు ఏ విధంగా కుంభకోణానికి పాల్పడింది వివరించింది. అయితే తొలి చార్జిషీటులో ప్రస్తావించిన ముఖ్యలను రెండో చార్జిషీటులో నిందితులుగా చూపుతారని న్యాయవాద వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే సమయంలో రెండో చార్జిషీటు దాఖలు చేసే లోగా నిందితులను అరెస్టు చూపాల్సిన అవసరం కూడా ఉందని అంటన్నారు. దీంతో బిగ్ బాస్ గా అనుమానిస్తున్న ముఖ్య నేతను ఆగస్టులో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఆగస్టులోనే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఉచిత బస్సు’ పథకం ప్రారంభించనుంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది అయినా సూపర్ సిక్స్ హామీల్లో చాలావరకు అమలు చేయడం లేదని ప్రతిపక్షం వైసీపీ కొంతకాలంగా విమర్శిస్తోంది. అయితే విపక్ష వాదనను తిప్పికొట్టే ప్రయత్నంలో ఉచిత బస్సు పథకం ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఈ పథకం కింద ఏ పరిధి వరకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారన్న ప్రశ్న వైసీపీ లేవనెత్తుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలు ‘ఉచిత బస్సు’ కోసం డొక్కు బస్సులు సిద్ధం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా జిల్లా పరిధికే ఉచిత బస్సు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ప్రస్తావిస్తూ మాట తప్పారంటూ రచ్చకు దిగుతున్నారు. దీంతో ఆగస్టులో పథకం ప్రారంభించే ముందు వైసీపీ దృష్టిని మళ్లించాలనే వ్యూహం కూడా సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
వైసీపీని షాక్ కు గురిచేసే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆగస్టులో సంచలనం నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యనేతను అరెస్టు చేస్తే రాజకీయంగా వైసీపీ నిరసనలకు దిగే అవకాశం ఉందని, అదే సమయంలో ఉచిత బస్సు పథకం అమలు చేసి ప్రజలు వైసీపీ నిరసనలను పట్టించుకోకుండా చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని అంటున్నారు. అంతేకాకుండా ఆగస్టులో రైతులు, రైతు కూలీలు ఎక్కువగా వ్యవసాయ పనుల్లో ఉంటారు. ఈ సమయం కూడా ముఖ్యమైన అరెస్టుకు కలిసొచ్చేదేనని అధికార పార్టీ భావిస్తోందని అంటున్నారు. మొత్తానికి ఆగస్టులో పెను సంచలనం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.
