రాజధానిలో రియల్ ఎస్టేట్.. అడ్డుపడుతోందెవరు ..!
ఒకటి రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించడం లేదు. దీనివెనుక కూడా కీలక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
By: Tupaki Desk | 27 April 2025 11:00 PM ISTఏపీ రాజధాని అమరావతి పనులు పుంజుకున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా.. సమాంతరం గా పుంజుకోవాలి కదా! పుంజుకుంటుందనే అందరూ అనుకున్నారు. వాస్తవానికి 2024లో కూటమి సర్కారు వచ్చాక.. రియల్ బూమ్ ఒక్కసారిగా పుంజుకుందన్న వాదన వచ్చింది. అయితే.. ఇది అనుకున్న విధంగా కొనసాగలేదు. సరే.. ఆ తర్వాత.. రాజధానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు రావడం.. పనులు కూడా ప్రారంభం కావడం తెలిసిందే.
దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా ముందుకు సాగుతుందని అందరూ భావించారు. కానీ, ఆ దిశగా అడుగులు మందగించాయి. దీనికి కారణం ఏంటి? మరోవైపు.. ఏపీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు.. హైదరాబాద్, యశ్వంత్‌పూర్(కర్ణాటక)లకు వెళ్లిపోతున్నారు. అక్కడ వారికి వ్యాపారాలు కలిసి వస్తున్నాయని కూడా టాక్. కొనేవారు.. ఎక్కువగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మరి ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనేది కీలకం.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించడం లేదు. దీనివెనుక కూడా కీలక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అదేవిధంగా ముడుపుల వ్యవహారం.. మరింతగా రియల్ ఎస్టేట్‌ను కుదేలయ్యేలా చేస్తోంది. ఓ కీలక నాయకుడే.. రేట్లు కట్టేసి.. సొమ్ములు వసూళ్లకు పాల్పడుతున్నారన్న విపక్షాల విమర్శలోనూ నిజం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
దీంతో రాజధానిలో మూడు పువ్వులు ఆరు కాయలు గా సాగాల్సిన రియల్ బిజినెస్.. రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారుతోంది.పైగా.. రాజధాని అంటే.. ఎక్స్‌పెన్సివ్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పరిణామాలతో మధ్యతరగతి జీవులు కూడా.. విజయవాడ పరిసర ప్రాంతాలను దాటిముందుకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని రియల్ ఎస్టేట్ పుంజుకునేలా చర్యలు తీసుకోకపోతే.. ఈ రంగం ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
