Begin typing your search above and press return to search.

ఆ ఎంపీలు డిఫ‌రెంట్‌: త‌న‌మ‌న లేకుండా పోయిందే.. !

రాష్ట్రంలో నాయ‌కులు గిరి గీసుకుని రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది స‌హ‌జం కూడా. రాజ‌కీయంగా వారికి ఉన్న ప‌రిమితులు వారికి ఉన్నాయి

By:  Tupaki Desk   |   19 July 2025 8:30 AM IST
ఆ ఎంపీలు డిఫ‌రెంట్‌: త‌న‌మ‌న లేకుండా పోయిందే.. !
X

రాష్ట్రంలో నాయ‌కులు గిరి గీసుకుని రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది స‌హ‌జం కూడా. రాజ‌కీయంగా వారికి ఉన్న ప‌రిమితులు వారికి ఉన్నాయి. అయితే.. కొంద‌రు మాత్రం గిరి గీసుకోకుండా.. త‌న‌మ‌న అని కూడా చూడ‌కుండా.. ప‌నులు చేస్తున్నారు. చేయించుకుంటున్నారు. ఈ త‌ర‌హా నాయ‌కులు ఇటు వైసీపీలోను, అటు టీడీపీలోనూ ఉన్నార‌న్న‌ది రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తిరుప‌తి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ ఎంపీ.. గురుమూర్తికి.. త‌న మ‌న లేదు.

ఆయ‌న గ‌తంలో అయినా.. ఇప్పుడు అయినా.. వివాదాల‌కు దూరంగానే ఉంటున్నారు. ఎవ‌రినీ నొప్పించ రు. త‌న వ‌ద్ద‌కు ఎవ‌రు వ‌చ్చినా.. ప‌నులు సాఫీగా జ‌రిగేలా చూస్తారు. ఈ క్ర‌మంలో పార్టీ లైన్‌ను కూడా ఆయ‌న దాటి ప‌నులు చేస్తున్నారు. ఇటీవ‌ల తిరుపతికే చెందిన‌ టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రు ఎంపీని క‌లిశారు. స్థానికంగా.. త‌న‌కు ఉన్న ఇబ్బందులు చెప్పుకొచ్చారు. తాను ఒక ప‌రిశ్ర‌మ పెడుతున్నాన‌ని.. కానీ.. వైసీపీ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. దీనికి ఎంపీ అభ‌యం ఇచ్చారు.

తానే స్వ‌యంగా మాట్లాడి.. స‌ద‌రు కంపెనీ ఏర్పాటు అయ్యేలా చేస్తాన‌ని చెప్పారు. దీనివ‌ల్ల స్థానికంగా 150 మంది యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇక్క‌డ డౌట్ రావొచ్చు. టీడీపీ అధికారంలో ఉంది క‌దా.. అలాంట‌ప్పుడు న‌యానో.. భ‌యానో.. స‌ద‌రు ఎమ్మెల్యే ప‌ని చేసుకోవ‌చ్చుక‌దా అని. కానీ.. ఈ ఎమ్మె ల్యే కూడా వివాదాల‌కు దూరంగా ఉంటారు. పైగా సౌమ్యుడ‌నే పేరు ఉంది. దీంతో ఇబ్బందులు లేకుండా.. క‌లుపుకొని పోయే త‌త్వంతో ఆయ‌న ఎంపీని ఆశ్ర‌యించారు.

ఇక‌, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ స్ట‌యిల్ కూడా ఇంతే. ఆయ‌న వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చి ఎంపీ అయ్యారు. కానీ, ప‌నులు మాత్రం ఇరు శిబిరాల‌కు చేస్తున్నారు. ఎవ‌రినీ నొప్పించ‌రు. అయితే.. టీడీపీకి ఒక పిస‌రు ఎక్కువగా ప‌నులు చేస్తే.. అంతో ఇంతో వైసీపీ నాయ‌కుల‌కు కూడా చేస్తున్నారు. దీనికి కూడా కార‌ణం ఉంది.. ఈయ‌న‌కు బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. దీంతో ఎవ‌రిని నొప్పించినా.. త‌న వ్యాపారాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే బెంగ ఉంద‌ని అంటారు. అందుకే.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. త‌న మ‌న అనే తేడా లేకుండా.. ఈ ఎంపీలు ప‌నులు చేస్తున్నారు. అయితే.. పార్టీలు కూడా వీరి ని చూసీ చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.