బీజేపీకి భయపడి హిందీని ప్రమోట్ చేస్తున్నారు...జగన్ కూడా ?
దక్షిణాదిన హిందీ భాష మీద వివాదం సాగుతోంది. తమిళనాడు అయితే దశాబ్దాల క్రితమే హిందీ వద్దు అని అతి పెద్ద ఉద్యమం నిర్వహించింది.
By: Tupaki Desk | 16 July 2025 11:14 PM ISTదక్షిణాదిన హిందీ భాష మీద వివాదం సాగుతోంది. తమిళనాడు అయితే దశాబ్దాల క్రితమే హిందీ వద్దు అని అతి పెద్ద ఉద్యమం నిర్వహించింది. హిందీ గురించి ఎంతో గొప్పగా చెప్పే బీజేపీ నాయకులు సైతం తమిళనాడుకు వస్తే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు. అలా హిందీ విషయంలో తమిళులను ఒప్పించలేక పోయిన విషయం కళ్ళ ముందు ఉంది. మరో వైపు చూస్తే హిందీ భాష మీద ఎవరికి ఏ రకమైన అభిప్రాయం ఉన్నా హిందీ పేరు చెప్పి ఆధిపత్య రాజకీయాలకు తెర తీస్తున్నారు అన్నది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రబలంగా ఉంది.
పైగా హిందీ కంటే ద్రవిడ భాషలు ప్రాచీనమైనవి అని అందువల్ల కేవలం హిందీని మాత్రమే జాతీయ భాషగా చెప్పడం ఏ మేరకు సమంజసం అని కూడా విమర్శలు ఉన్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే ఏపీలో మాత్రం అన్ని పార్టీల నాయకులు తరత భేదం లేకుండా హిందీని జాతీయ భాషగా ప్రమోట్ చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ హిందీని రాజభాష అంటే నిన్న నారా లోకేష్ హిందీని జాతీయ భాష అన్నారు. ఇపుడు జగన్ సైతం అదే అంటున్నారు.
హిందీ జాతీయ భాషే ఇందులో వేరేగా చర్చించడానికి ఏముంది అని ఆయన అంటున్నారు. ఆయనను మీడియా హిందీ భాష వివాదం గురించి ప్రశ్నించినపుడు జగన్ స్పందిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. హిందీ భాష జాతీయ భాషే అని ఆయన అంటూ స్పష్టత కూడా ఇచ్చేశారు.
దేశంలో ఏ రాష్ట్రం వారు అయినా తొలి లాంగ్వేజ్ తమ మాతృ భాషను ఎంచుకోవచ్చు, రెండవ భాషగా హిందీని కచ్చితంగా పెట్టాలని మూడవ భాషగా ఇంగ్లీష్ ఉండాలని జగన్ ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని ఆయన అంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే అన్ని విధాలుగా వెనకబడతామని అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్ధులు ఇంగ్లీష్ ని సరిగ్గా నేర్చుకోకపోయినా స్పష్టంగా పలకకపోయినా మాట్లాడకపోయినా ప్రపంచంతో పోటీ పడలేరని జగన్ అన్నారు. ఇక ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉన్నా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ గా తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు అని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే పనిగట్టుకుని మరీ ఏపీ నాయకులు హిందీని ప్రమోట్ చేయడం పట్ల రాజకీయంగా చర్చ సాగుతోంది. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న ఆలోచనతోనే ఎవరికి వారు హిందీ జాతీయ భాష అంటున్నారు. నిజానికి హిందీ జాతీయ భాష కాకపోయినప్పటికీ దానిని ప్రమోట్ చేయడం కోసం పోటీలు పడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ జనసేన సరసన వైసీపీ కూడా చేరింది అని అంటున్నారు.
నిజానికి భాషకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిక్స్ చేయాలని కొందరు చూస్తున్నారు అని భాషావేత్తలు అంటున్నారు. భాషతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఒక వైపు మేధావులు అంటూంటే మరో వైపు అదే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీడియా సైతం గుచ్చి గుచ్చి అవే ప్రశ్నలు వేస్తోంది. మరి దానికి సరైన జవాబులు చెప్పవచ్చు. కానీ ఎవరూ హిందీని కాదు అనలేకపోతున్నారు. ఆ విధంగా చూస్తే దేశంలో ఎక్కడా లేని హిందీ అభిమానం ఏపీలో బాగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఇది నిజంగా బీజేపీ సాధించిన విజయమా లేక బీజేపీ అభిమానం ప్రాపకం కోసం ఏపీ రాజకీయ నేతలు అంతా కలసి చేస్తున్న భాషా విన్యాసమా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి చూస్తే హిందీకి జై హింద్ అంటున్న ఏపీ పార్టీలను నాయకులను దక్షిణాది రాష్ట్రాల నాయలుకు పార్టీలు ఏ విధంగా చూస్తాయో ఏ విధంగా ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాయో తెలియదు కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఫుల్ హ్యాపీస్ అవుతారేమో.
