Begin typing your search above and press return to search.

దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు?

భారత పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ఇండియా సిద్ధమవుతోంది.

By:  Tupaki Political Desk   |   25 March 2026 8:00 AM IST
దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు?
X

భారత పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ఇండియా సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ జరిగింది. రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ రెండు విడతల్లో పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. తొలి దశలో 70 వేల కోట్లతో 2029 నాటికి పూర్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2033 నాటికి రెండో దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఉత్తరాంధ్రలో సుమారు లక్ష ఉద్యోగాలు తీసుకువచ్చే ఈ పరిశ్రమపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు విశాఖ స్టీల్ కోసం ఉద్యమించిన నేలపై ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండానే భారీ పరిశ్రమ నిర్మాణానికి అడుగులు పడటంపై విస్తృత చర్చ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తోడుగా ఇప్పుడు నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ ఉత్తరాంధ్రను ప్రపంచ ఉక్కు పటంలో నిలబెట్టనుందని ప్రభుత్వం చెబుతోంది.

ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారని ప్రభుత్వం వివరిస్తోంది. నక్కపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో వందలాది అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని చెబుతున్నారు. అదేవిధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

రూ. 11,000 కోట్లకు పైగా పెట్టుబడితో ప్రత్యేక ఓడరేవును నిర్మిస్తున్నారు. ఇది ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మారుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్లాంట్‌ను జాతీయ రహదారి-16కి అనుసంధానిస్తూ 4-లైన్ల రహదారి పనులు ఇప్పటికే వేగవంతమయ్యాయని అంటున్నారు. ఇక భారీ స్టీల్ ప్లాంట్ తో నక్కపల్లి ప్రాంతం స్టీల్ సిటీగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల కొత్త టౌన్‌షిప్‌లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటు కానున్నాయని ఆశిస్తున్నారు. దీంతో నక్కపల్లి భవిష్యత్తులో ఒక అధునాతన 'స్టీల్ సిటీ'గా రూపాంతరం చెందనుందని చెబుతున్నారు.

ఇక 2029 ఎన్నికలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించేలా పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమకు సహకరిస్తోంది. అయితే ప్రభుత్వం అనుకున్న విధంగా అంతే వేగంగా పనులు జరుగుతాయా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరుకున్నట్లు మూడేళ్లలో భారీ పరిశ్రమ నిర్మాణం అంటే పెద్ద సవాలే అంటున్నారు. ఇక మాట ఇచ్చాం...మార్పు తెచ్చాం అంటూ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నామని, ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశామని సీఎం ఎక్స్ లో ట్వీట్ చేశారు. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చామని సీఎం తన ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేసుకుని ఇది ప్రారంభమైతే ఒక రికార్డుగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.