Begin typing your search above and press return to search.

అంబటి సంచలన వ్యాఖ్యలు.. సీఎంపై తీవ్ర ఆరోపణలు!

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Political Desk   |   5 March 2026 2:02 PM IST
అంబటి సంచలన వ్యాఖ్యలు.. సీఎంపై తీవ్ర ఆరోపణలు!
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 31న గుంటూరులో అంబటి ఇంటిపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని మాజీ మంత్రి ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారని కాపు కులస్తులు అంతా కూటమితో ఉన్నారని అనుకోవద్దని హెచ్చరించారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇటీవల అంబటి అరెస్టు, విడుదల తర్వాత ఆయన తొలిసారిగా విశాఖ వెళ్లారు. అక్కడ కాపు నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.

అంబటి ఇంటిపై దాడి తర్వాత కాపు నేతల నుంచి సానుభూతి పొందిన మాజీ మంత్రి.. తన సామాజికవర్గాన్ని ఏకం చేసేలా పావులు కదుపుతున్నారు. విశాఖ పర్యటన ద్వారా అంబటి ఈ సంకేతాలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేసిన అంబటి, కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలని కోరుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా మంత్రి లోకేశ్ రెడ్ బుక్, పిచ్చి బుక్ లు తనను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. రెడ్ బుక్కుకు తన కుక్క కూడా భయపడదని అనడంతో మంత్రి లోకేశ్ కు కోపం వచ్చిందని వ్యాఖ్యానించారు అంబటి.

విశాఖలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంట్లో వైసీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలను చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ప్రారంభమైందని, తన ఇంటిపై జరిగిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి హెచ్చరించారు. తనపై జరిగిన దాడిని ఒక కులంపై మరో కులం చేసిన దాడిగా చూడాలని సూచించారు. తనను 18 రోజులు అక్రమంగా జైలులో ఉంచారని, ఆ సమయంలో పార్టీ నేతలు మద్దతుగా నిలిచారని ధన్యవాదాలు తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా తన ఇంటిపై దాడి జరిగిందని, టీవీ చానళ్లలో లైవ్ వస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ గుండాలకు అలుపు వచ్చేవరకు దాడి చేశారని ధ్వజమెత్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాడి కొనసాగిందని, ఈ దాడితోనే చంద్రబాబు పతనం ఆరంభమైందని వ్యాఖ్యానించారు అంబటి. పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేశారని ఆరోపించారు. గతంలోనూ పోలీసుల సహకారంతో కాపు నేత వంగవీటి రంగాను హత్య చేశారని, రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను జైలులో పెట్టారని మాజీ మంత్రి అంబటి వెల్లడించారు.