Begin typing your search above and press return to search.

ఏంటి రాజా... వైసీపీ వాళ్లు టీడీపీకి ఓటు వేశారా?

ఈ మూడు సార్లు జరిగిన ఎన్నికల్లోని ఓట్ల శాతాలు సరిగ్గా చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014, 2019, 2024లో వరుసగా అదే జరిగింది!

By:  Tupaki Desk   |   12 July 2025 9:00 PM IST
ఏంటి రాజా... వైసీపీ వాళ్లు టీడీపీకి ఓటు వేశారా?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 నుంచి చూసుకుంటే 2024 ఎన్నికల వరకూ కూడా అధికారంలో ఎవరున్నా, ప్రతిపక్షంలో ఇంకెవరున్నా.. గెలుచుకున్న సీట్లలో తేడా ఉంటుందే తప్ప ఓట్ల విషయంలో పెద్దగా తేడా ఉండదు. ఈ మూడు సార్లు జరిగిన ఎన్నికల్లోని ఓట్ల శాతాలు సరిగ్గా చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014, 2019, 2024లో వరుసగా అదే జరిగింది!

ఎందుకంటే... ఏపీలో టీడీపీకి నికార్సుగా 40% సొంత ఓటింగ్ ఉందని అంటారు.. ఇదే సమయంలో 40 శాతానికి తగ్గకుండా అన్నట్లుగా వైసీపీకి సొంత ఓటు బ్యాంక్ ఉందని చెబుతారు. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించడంలో న్యూట్రల్ ఓటర్స్ ది కీలక పాత్ర అని చెబుతారు. అయితే... టీడీపీకి వైసీపీ కార్యకర్తలు కూడా ఓటు వేశారని అంటున్నారు అంబటి రాంబాబు!

అవును.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది? అని అడిగితే... చాలామంది వైసీపీ నేతలు అందుకు కారణం ఈవీఎం మిషన్స్ అని చెప్పుకున్నారు! 2019లో ఎందుకు గెలిచారయ్యా అంటే... 2014లో చంద్రబాబు పాలన బాగోలేక అన్నారు! ఇప్పుడు 2014లో ఎందుకు ఓడిపోయారయ్యా అంటే.. వైసీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేశారని అంటున్నారు అంబటి!

వివరాళ్లోకి వెళ్తే... ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యిందని చెబుతూ మైకుల ముందుకు వచ్చిన అంబటి రాంబాబు... కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని అంటున్నామని.. ఇచ్చిన హామీలు మొత్తం ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తే శబాష్ అని అనే వాళ్ళమని.. ‘తల్లికి వందనం’ సంవత్సరం గడిచాక ఇచ్చారని అన్నారు.

ఇదే సమయంలో... 'తల్లికి వందనం' ఆలోచన లోకేష్ కి పుట్టిందని చంద్రబాబు అంటున్నారని.. అది జగన్ 'అమ్మ ఒడి' కార్యక్రమం కాపీ అని చెప్పిన అంబటి.. ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్య శ్రీ కూడా తానే పెట్టానని చంద్రబాబు అంటాడేమో అంటూ ఎద్దేవా చేశారు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసి 'అమ్మ ఒడి' లాంటి పథకాలు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే... 2014లో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా ఓట్లు వేశారని.. తీరా అధికారంలోకి వచ్చాక ఫైనల్ గా అందరిని ముంచాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలను అంబటి వ్యాఖ్యలు అవమానించినట్లుగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

చాలామంది నేతలు ఓటమి పాలైన సందర్భంలో పలు రకాల విశ్లేషణలు చేసుకుంటూ ఉంటారు. అయితే... తమ పార్టీ కార్యకర్తలు, పక్క పార్టీ నాయకుడి మాటలను నమ్మి అటు వెళ్లిపోయారని చెప్పడం రెండు సమస్యలు కారణమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఒకటి.. తమ నాయకుడిని తక్కువ చేయడం కాగా.. తమ కార్యకర్తలను అవమాన పరచడం ఇంకొకటి అని అంటున్నారు.

ఏది ఏమైనా... ఓటమికి గల కారణాలు విశ్లేషించాల్సి వచ్చినప్పుడు, ప్రత్యర్థులను విమర్శించాల్సి వచ్చినప్పుడు మరీ ఇంతకు దిగిపోకుండా.. కాస్త ఆలోచించి మాట్లాడాలని పలువురు సూచిస్తున్నారు. 2014 పాలనకు సంబంధించిన ఫలితాలు 2019లో వచ్చేసినవి కదా.. జరగాల్సిన పని చూడకుండా అయిపోయిన పెళ్లికి బాజాలెందుకని గుర్తు చేస్తున్నారు!

2014లో రుణమాఫీ అన్నారు.. ఆ హామీ ఏ స్థాయిలో అమలయ్యిందో, దానివల్ల ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో 2019లో ఫలితాలు చెప్పాయి! ఇదే సమయంలో.. 2019లో అద్భుతః అని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ప్రజల అసంతృప్తి 2024 ఫలితాలలో కనిపించింది. ఈసారి కూటమి పాలన బాగుంటే 2024 రిపీట్ అవుతుంది.. బాగోకపోతే 2019 రిపీట్ అవుతుంది అని చెప్పుకుంటే బెటరని అంటున్నారు!

అలా కాకుండా ప్రజల అభిప్రాయాలను అవమానపరుస్తూ, పార్టీ కార్యకర్తల నమ్మకాలను అగౌరవపరుస్తూ మాట్లాడోద్దని సూచిస్తున్నారు!!