Begin typing your search above and press return to search.

అమరావతిలో మరో అధునాతన నగరం!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   7 April 2025 6:00 PM IST
Amaravati Science City
X

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 2015లో శంకుస్థాపన జరిగిన ఈ మహానగరం నిర్మాణం వైసీపీ పాలనలో పడకేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన నుంచి అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాలని అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం రోజుకో థీమ్ ను ముందుకు తెస్తోంది. ఇప్పటికే నవనగరాల కాన్సెప్ట్ తో రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేయగా, ఇప్పుడు ఏఐ సిటీ, క్వాంటమ్ కంప్యూటరింగ్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక తాజాగా రాజధానిలోనే 50 ఎకరాల్లో సైన్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతోపాటు, దేశంలో ఎక్కడా లేని వసతులు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ రంగాల్లో అమరావతిని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధాని పునఃనిర్మాణ పనులతోపాటే కొత్త కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెస్తోంది. గతంలో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధానిలో నవ నగరాలు ఉంటాయి. ఈ నవ నగరాల్లో దేనికది తీసిపోని విధంగా నిర్మించడంతోపాటు అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. అయితే గత ఏడాది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అమరావతికి అదనపు హంగులు అద్దాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా డ్రోన్ సిటీ, ఏఐ సిటీ, క్వాంటమ్ కంప్యూటర్ హబ్ వంటి టెక్నాలజీ రంగాలకు పెద్దపీట వేశారు. ఇక హైదరాబాద్ లోనే గతంలో చంద్రబాబు నిర్మించిన జీనోమ్ వ్యాలీని తలదన్నెలా అమరావతిలో కొత్తగా సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు.

సీఎం చంద్రబాబు ఆలోచన ప్రకారం అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం కూడా ఓకే చెప్పిందంటున్నారు. సుమారు 50 ఎకరాల్లో నిర్మించనున్న సైన్స్ సిటీకి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున కేంద్రమే ఈ నిధులను భరించేలా సీఎం చంద్రబాబు ఒప్పించారని అమరావతిలో టాక్ నడుస్తోంది. అమరావతిలో నిర్మించనున్నా ఈ సైన్స్ సిటీలో పది మ్యూజియమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్లు, గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కొత్త పరిశోధనలను ప్రోత్సహించేలా యువత కోసం నైపుణ్యాల పెంపు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

వాస్తవానికి సైన్స్ సిటీల నిర్మాణానికి అయ్యే వ్యయంలో సగం మాత్రమే కేంద్రం భరిస్తుంది. అయితే నవ్యాంధ్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ద్రుష్ట్యా మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు విన్నవించారని అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు రిక్వెస్టును సానుకూలంగా పరిగణించిన కేంద్రం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైన్స్ సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సైన్స్ సిటీ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.