టీడీపీ వర్సెస్ వైసీపీ...ఎవరి ట్రాప్ లో ఎవరు ?
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వ్యతిరేకించింది అన్నది టీడీపీ అభిప్రాయంగా ఉంది. అయితే వైసీపీ తన స్టాండ్ చెప్పేసింది, ఆ మీదట ప్రజలు ఆ పార్టీ విషయంలో నిర్ణయించుకుంటారు.
By: Satya P | 4 April 2026 5:00 AM ISTఅమరావతి రాజధాని ఎపిసోడ్ లో అధికార టీడీపీ విపక్ష వైసీపీ ఇద్దరూ ఢీ కొడుతున్నారు. ఎవరి ఆలోచనలు వారివిగా ఉన్నాయి. అమరావతి అసాధ్యం అని వైసీపీ అంటూంటే భవిష్యత్తు రాజధాని అని టీడీపీ అంటోంది. ఈ నేపధ్యంలో జగన్ మావిగాన్ పేరుతో ప్లాన్ బీని ప్రకటించారు. ఇక కూటమి అయితే అమరావతి చట్టబద్ధత మీద సంబరాలు చేసుకుంటోంది. వైసీపీని అమరావతి ద్రోహిగా టీడీపీ విమర్శిస్తూంటే వైసీపీ ఏపీకి అమరావతి రాజధాని ఒక అంతులేని కధ యాభై ఏళ్ళు అయినా పూర్తి కాదంటోంది. ఇలా అమరావతి మీద హీటెడ్ డిస్కషన్ తో ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
చంద్రబాబు తీవ్ర స్థాయిలో :
గడచిన మూడు రోజులుగా వైసీపీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు దాని కంటే ముందు మార్చి 28న అమరావతికి చట్టబద్ధత కోసం ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా వైసీపీ తీరు మీదనే కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు విరుచుకుపడ్డారు. ఈ సమావేశానికి వైసీపీ గైర్ హాజరు అయింది. నిజానికి వైసీపీ వస్తుందని ఒక దశలో అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అలా వైసీపీ వ్యూహాత్మకంగా సాగించిన అమరావతి రాజధాని ఎపిసోడ్ లో తనదైన ఎత్తుగడలు పార్లమెంట్ సాక్షిగా పదును తేరాయి. దాంతో టీడీపీకి ఇది ఇబ్బందికరంగా మారిందా అన్న చర్చ వస్తోంది.
దేశమంతా చూసిందా :
ఏపీలో రెండు పార్టీలు దశాబ్దాల రాజకీయ వైరం అన్నది అయిదు కోట్ల మంది ప్రజలకు తెలిసిందే. కానీ దేశమంతా చూసే పార్లమెంట్ లో వైసీపీ వ్యవహరించిన తీరు అయితే టీడీపీని ఇబ్బంది పెట్టిందనే అంటున్నారు. మొత్తం యాభై పార్టీలు కలసి అమరావతి రాజధానికి మద్దతుగా నిలిస్తే వైసీపీ మాత్రం వ్యతిరేకించి వాకౌట్ చేసింది. పైగా ఏపీకి చెందిన ఒక పార్టీ అమరావతి రాజధాని విషయంలో తాము ససేమిరా మద్దతు ఇవ్వమని అక్కడ రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఎలుగెత్తి చాటింది. అయితే బిల్లు పాస్ అయింది కానీ ఈ విషయం అయితే చర్చకు జాతీయ స్థాయిలోనూ వచ్చింది. ఇదే ఇపుడు టీడీపీని మరింతగా ఇరిటేట్ చేస్తోందా అన్నదే చర్చ.
ఏపీ ఓట్లతో గెలిచి :
బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ మీద నిప్పులు చెరిగారు. ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై మద్దతు పలికితే ఒక్క వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించి వాకౌట్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కొందరికి రాష్ట్రం గురించి తెలియదని రాష్ట్రంతో అవసరం కూడా ఉండకపోవచ్చు కానీ అలాంటి పార్టీలు కూడా రాజధాని చట్ట బద్దత కల్పించే బిల్లుకు సహకరించాయి, అనుకూలంగా ఓటేశాయని బాబు గుర్తు చేశారు.
రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే :
అయితే ఏపీలో ఓట్లు పొంది ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారని బాబు మండిపడ్డారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించారని అన్నారు. దేశంలోని పార్టీలన్నీ ఓవైపు ఉంటే వైసీపీ మాత్రం మరో వైపు నిలిచిందని బాబు విమర్శించారు. వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే రీతిలో వైసీపీ ఆలోచిస్తోందని బాబు ఫైర్ అయ్యారు.
కుట్రలు..కుతంత్రాలు :
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ చాలా డ్రామాలు ఆడిందని బాబు విమర్శించారు. అమరావతి మీద వైసీపీ వారు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారని అన్నారు. తుగ్లక్ లు కొత్తగా పాలనలోకి వచ్చి రాజధానిని ప్రతీసారీ మారుస్తామంటే ఎలా అని బాబు ప్రశ్నించరు. దీనికి అర్ధం ఉంటుందా అని నిలదీశారు. శాశ్వత రాజధాని అని పార్లమెంటు చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని జగన్ మీద గుస్సా అయ్యారు. ఇదేం రాజకీయమని అంటూనే ఇలాంటి నాయకులు ఉండటం రాష్ట్ర దౌర్బాగ్యం అని బాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. ఏకంగా ప్రజలకు, ప్రజాధనానికి నష్టం జరిగేలా వ్యవహరిస్తారా అని బాబు గద్దించారు. ప్రజలకు సంక్షేమం, జీవన ప్రమాణాలను కల్పించటంపైనే ఎవరైనా మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి వారి పట్ల మాట్లాడటం కూడా అనవసరమని బాబు చివరికి అభిప్రాయపడ్డారు.
సవాల్ గా తీసుకోవాల్సిందే :
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వ్యతిరేకించింది అన్నది టీడీపీ అభిప్రాయంగా ఉంది. అయితే వైసీపీ తన స్టాండ్ చెప్పేసింది, ఆ మీదట ప్రజలు ఆ పార్టీ విషయంలో నిర్ణయించుకుంటారు. వైసీపీ అమరావతి నిర్మాణం అసాధ్యం అని అంటోంది. దానిని సవాల్ గా తీసుకుని టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేయాలి, వైసీపీని విమర్శిస్తూ కూర్చుంటే వారి వ్యూహంలోనే చిక్కుకున్నట్లు అవుతుందని అంటున్నారు. ఈ రోజున అయితే వైసీపీ మాటలను పక్కన పెట్టి మరీ అయిదు కోట్ల మంది ప్రజలు కూటమి వైపు చూస్తున్నారు. మరి కూటమి అమరావతికి ఒక రూపూ షేపూ తేవడం మీదనే అందరి భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది మరవరాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
