మండలి సమావేశం లేదా? అమరావతిపై అసెంబ్లీ ప్రత్యేక భేటీ.. వైసీపీ ఇంట్రెస్టింగ్ రియాక్షన్
అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా ఆ వెంటనే గవర్నర్ ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
By: Tupaki Political Desk | 26 March 2026 10:33 PM ISTఅసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై వైసీపీ స్పందించింది. ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తుకు ఢోకా లేకుండా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ప్రభుత్వం ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతోంది. ఇందుకోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది. ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా ఆ వెంటనే గవర్నర్ ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ప్రభుత్వ అనూహ్య నిర్ణయంపై వైసీపీ తెలివిగా స్పందించింది. గత ప్రభుత్వంలో మూడు రాజధానులను ప్రతిపాదించిన వైసీపీ, ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానంపై ఏం చెబుతుందనేది అందరిలో ఉత్కంఠ రేపింది. దీనిపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ ముఖ్య సమన్వయకర్త సజ్జల రామకృష్ణరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ తీర్మానం అంటూ హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిని సమావేశ పరచకపోవడం ఏంటని సజ్జల ప్రశ్నించారు.
అమరావతి కోసం అసెంబ్లీ తీర్మానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అమరావతి పేరిట రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు తీసుకున్న ప్రభుత్వం, వాటిని సరిగా అభివృద్ధి చేయలేకపోయిందని, ఇదే సమయంలో కూటమి నేతల అవినీతిపై విమర్శలు ఎక్కువవుతున్నాయని సజ్జల ఆరోపించారు. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమరావతి గురించి ఆర్టీఐ కింద ప్రశ్నలు వేసినా సమాచారం ఇవ్వడం లేదని సజ్జల తెలిపారు. అమరావతి నిర్మాణాల పేరుతో భారీగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ47 వేల కోట్లకు శాంక్షన్లు ఇచ్చారని, ఎవరైనా ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఏపీలో భాగం కాదా? అమరావతిలో మా పార్టీకి ఓట్లు రాలేదా? అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
కాగా, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం శాసనమండలిని సమావేశపరచకపోవడంపై వైసీపీ సూటిగా ప్రశ్నించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని మాత్రమే ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సజ్జల లేవనెత్తిన ప్రశ్న రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం వల్లే ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహణకు ఆసక్తి చూపలేదని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనలతోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానం చేయనుందని చెబుతున్నారు. ఈ క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం సూచించిందని, ఈ కారణంగానే ఈ నెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ మరోసారి తీర్మానం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని పంపించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్రం తుది నిర్ణయం తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అంటున్నారు.
