అమరావతి 2.0... పది నెలల్లో కూటమి సర్కార్ చేసిందిదే!
ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం 2019 - 2024 మధ్య వైసీపీ సర్కార్ హయాంలో చెడు దినాలను చవి చూసిన సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 2 May 2025 1:24 PM ISTఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం 2019 - 2024 మధ్య వైసీపీ సర్కార్ హయాంలో చెడు దినాలను చవి చూసిన సంగతి తెలిసిందే! అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఏపీ ప్రజా రాజధానికి మహర్దశ మొదలైంది.. అమరావతి 2.0 మొదలైంది.. ఏపీ రాష్ట్రంలో నవశకం మొదలైంది. దానికి నేడు ముహూర్తం ఫిక్సయ్యింది.
అవును... అమరావతి పునఃనిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధానమంత్రి మోడీ చేతుల మీద అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి కోసం పట్టాలెక్కించిన ప్రగతి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అయ్యింది! ఈ మధ్యలో తుఫానులు, రాజధాని ప్రాంతంలో వరదలు.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ.. పదినెలల్లో ప్రగతిని పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ప్రధానంగా.. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించింది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ఫలితంగా... వరల్డ్ బ్యాంక్, ఏడీబీలను ఒప్పించి హుటాహుటున రూ.15,000 కోట్ల ఆర్థిక సాయం అందేలా చేసింది. ఇదే సమయంలో.. హడ్కోకు మరో రూ.11,000 కోట్ల రుణం మంజూరు చేసింది.
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టేలా రూ.77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది.. ఇదే క్రమంలో రూ.49,000 కోట్ల పనులకు టెండర్లు ఖరారు చేసింది. రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని ఫిక్సయ్యింది.
ఇదే సమయంలో... రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడాన్నికి ఎర్రుపాలెం - నంబూర్ మధ్య 56.53 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు రూ.2,047 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా... 189.4 కి.మీ. పొడవున అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (ఏ.ఓ.ఆర్.ఆర్.)ను రూ.16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది.
దీనికి సంబంధించిన ఖర్చును భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇదే సమయంలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డీ.) త్వరలో పూర్తిస్థాయి తరగతులు ప్రారంభించనుంది! ఈ సమయంలో అమరావతిలో ఎల్ & టీ సంస్థ ఐటీ టవర్ నిర్మించబోతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను నెలకొల్పనుంది.
అదే విధంగా... ఐబీఎం, టీసీఎస్, ఎల్ & టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. మరోపక్క ప్రభుత్వం సీఐఐతో కలిసి గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో రైతులకు పరిహారం కాకుండా అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించి.. రాజధాని అభివృద్ధి ఫలాలను వారికి అందేలా చేసింది.
