అమరావతి పై ఎక్కువ ఫోకస్.. వ్యతిరేకత పెంచుతుందా?
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెంచారు.
By: Tupaki Desk | 28 Jun 2025 11:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వం సేకరించిన సమాచారం ద్వారా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లభించిందని చెబుతున్నారు. రాష్ట్రానికి రాజధాని ముఖ్యమైనా.. ప్రతి రోజూ అమరావతి పాట పాడటంపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రభుత్వం తన ప్రాధాన్యతాంశంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తూనే.. ప్రజల్లో సానుకూలత పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచనలిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెంచారు. ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో అమరావతి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగారు. ముందుగా రాజధాని అమరావతిలో పర్యటించి పనులు పునః ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. అడవిలా పెరిగిపోయిన తుప్పలు తొలగించడమే కాకుండా, పునాదుల్లో చేరిన నీటిని తోడించారు. తొలి ఆరు నెలలు రోజువారీ సమీక్షలతో అమరావతిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అమరావతి నిర్మాణానికి నిధులు సాధించారు. గత మే నెలలో ప్రధాని మోదీతో రెండోసారి అమరావతి పనులకు ప్రారంభోత్సం నిర్వహించారు.
అయితే ఏడాదిగా రాజధాని అమరావతిపై హడావుడి తప్పిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ప్రభుత్వం చెప్పడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. ఇటీవల రకరకాల మార్గాల ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. రాజధాని పనులు ప్రారంభంపై ప్రజల్లో సానుకూలత ఉన్నా, ఎక్కువ హడావుడి చేస్తున్నారని, ప్రచారం చేసినంత స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైందని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మిగిలిన సమస్యలు, ఇతరత్రా పాలన అంశాలను వదిలేసి కేవలం రాజధానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని మెజార్టీ ప్రజలు అభిప్రాయ పడినట్లు చెబుతున్నారు.
దీంతో రాజధాని పనులను స్వాగతిస్తూనే.. ఎక్కువ ప్రచారం చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజధాని కోసం ఇప్పటికే సమీకరించిన భూములు కాకుండా, అదనంగా మరో 44 వేల ఎకరాలు సమీకరించాలనే ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. ఇప్పటి వరకు కాగితాల్లో కనిపిస్తున్న అభివృద్ధి కళ్లకు చూపించిన తర్వాతే అదనపు భూ సమీకరణకు వెళ్లాలని పలువురు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. అమరావతితోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, తల్లికి వందనం, దీపం-2 వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటిపై పెద్దగా ప్రచారం చేయకపోవడమే వ్యతిరేకత కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. దీంతో అమరావతిపై ప్రచారం తగ్గించాలని ఆయన సూచించారని అంటున్నారు.
