అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. మొత్తం ఖర్చు ఎంతో తెలుసా?
గతంలో నాలుగు వరుసలుగా నిర్మించాలని భావించిన ఈ రింగు రోడ్డును ప్రస్తుతం ఆరు వరుసల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
By: Tupaki Desk | 12 Sept 2025 5:23 PM ISTఅమరావతి ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు అంచనాలు సిద్ధమయ్యాయి. గతంలో నాలుగు వరుసలుగా నిర్మించాలని భావించిన ఈ రింగు రోడ్డును ప్రస్తుతం ఆరు వరుసల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. మొత్తం 190 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ఏకంగా రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు రిపోర్టు సిద్ధం చేశారు. ఆరు వరుసల రోడ్డుతోపాటు ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీసు రోడ్డు నిర్మించనున్నారు. దీంతో అమరావతి ఓఆర్ఆర్ మొత్తం పది వరుసలుగా ఉంటుందని చెబుతున్నారు.
గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మించాలని భావించారు. ఇందుకోసం రూ.16,310 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ధరలు పెరగడం, నాలుగు వరుసల రోడ్డుకు బదులుగా ఆరు లైన్ల రహదారి నిర్మించాలని భావిస్తుండటంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అంటున్నారు. గతంలో ప్రతిపాదించిన వెడల్పునకు రెట్టింపుగా అంటే మొత్తం 140 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో రూ.25 వేల కోట్లతో అంచనాలు రూపొందించి ఆమోదం కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీకి పంపారు. ఈ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) పరిశీలనకు ఫైలును పంపనున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కమిటీకి పంపుతారని అధికారులు చెబుతున్నారు.
కాగా, భవిష్యత్ అవసరాలను ఇప్పుడే ద్రుష్టిలో పెట్టుకుని 140 మీటర్ల మేర రింగు రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో సంప్రదించారు. సీఎం ప్రతిపాదనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో తయారు చేసిన అంచనాలు స్థానే కొత్త అలైన్మెంటుతో ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు 70 మీటర్ల మేర రహదారి నిర్మించి వదిలేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే సందేహంతో 140 మీటర్ల మేర రింగు రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. భవిష్యత్తులో భూమి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, భూ సేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందనే ఉద్దేశంతో ఇప్పుడే 140 మీటర్ల మేర భూ సేకరణ చేయాలని సీఎం అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్, క్రిష్ణా, గుంటూరు, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో భూములు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వీటి వివరాలను ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారని చెబుతున్నారు. అయితే ఈ వివరాలను కలెక్టర్లు పరిశీలించి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సివుంటుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా, మరో రెండు వారాల్లో అన్ని జిల్లాల నుంచి రింగు రోడ్డుపై కలెక్టర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని అంటున్నారు. ఇక రింగు రోడ్డు నిర్మాణంపై జీఎస్టీ, సీనరేజు ఫీజులను ప్రభుత్వం మినహాయించనున్నట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు.
