Begin typing your search above and press return to search.

అమరావతి, ఇకపై ఇవి తప్పనిసరి.. కీలక ఉత్తర్వులు విడుదల

రాష్ట్ర రాజధానిగా అమరావతి గుర్తింపును మరింత పటిష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

By:  Tupaki Political Desk   |   15 April 2026 4:03 PM IST
అమరావతి, ఇకపై ఇవి తప్పనిసరి.. కీలక ఉత్తర్వులు విడుదల
X

రాష్ట్ర రాజధానిగా అమరావతి గుర్తింపును మరింత పటిష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ, పరిపాలనాపరంగా అమరావతి ఉనికిని చాటేలా ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా అధికారిక పత్రాల్లో పేరు మార్పు, స్పెల్లింగ్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆంగ్ల అక్షారాల్లో అమరావతిని ఎలా రాయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అధికారిక నోట్‌లలో 'అమరావతి' అనివార్యం

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం నుంచి ఇకపై ఏ ఉత్తర్వులు జారీ చేసినా అమరావతి పేరుతోనే ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇక నుంచి అన్ని శాఖల అధికారిక నోట్‌లు, ఉత్తర్వులు, పత్రాల్లో తప్పనిసరిగా ‘అమరావతి’ పేరును రాయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది.

స్పెల్లింగ్‌లో మార్పు

అమరావతి పేరును ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఇప్పటివరకు చాలామంది 'Amaravathi' (చివర 'thi') అని వాడుతున్నారు. అయితే, గెజిట్ నోటిఫికేషన్లు, చారిత్రక ప్రాధాన్యతను అనుసరించి, ఇకపై ‘Amaravati’ (చివర ‘ti’) అని మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏకరీతి గుర్తింపు కోసం ఈ చిన్నపాటి మార్పు ఎంతో కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. పేరు విషయంపైనా ప్రభుత్వం పకడ్బందీగా సూచనలు చేయడం చూస్తే అమరావతి విషయంలో ఎటువంటి తప్పిదానికి చోటివ్వదనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

రాజధానిగా గుర్తింపు

కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా, అమరావతిని చట్టబద్ధంగా మౌలిక సదుపాయాల పరంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే లక్ష్యంతో, దానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంది. అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయించి పార్లమెంటు ఆమోదం పొంది అమరావతి చట్టాన్ని తీసుకువచ్చిందని అంటున్నారు.