అమరావతి ఆహ్వాన పత్రిక...ఎవరి పేరో మిస్ అయిందా ?
ఈ రెండు పేర్లూ తెలుగు ఇంగ్లీషులలో ముద్రించారు. అంతవ్రకూ బాగానే ఉంది కానీ ఈ మొత్తం ఆహ్వాన పత్రికలో ఒకరి పేరు మిస్ అయింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 4:45 PMఅమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మే 2న రాష్ట్రానికి వస్తున్నారు ఆయన చేతుల మీదుగా లక్ష కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రాలు ప్రతీ రైతు కుటుంబం ఇంటికి వెళ్ళి అధికారులు అందచేస్తున్నారు. వారికి బొట్టు పెట్టి మరీ ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాలని కోరుతున్నారు.
ఇక జిగేల్మనే తీరున ఈ ఆహ్వాన పత్రాలు రూపొందించారు. అందులో ఒక వైపు చూస్తే ప్రధాని నరేంద్రమోడీ ఉంటే మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఉంది. ఈ రెండు పేర్లూ తెలుగు ఇంగ్లీషులలో ముద్రించారు. అంతవ్రకూ బాగానే ఉంది కానీ ఈ మొత్తం ఆహ్వాన పత్రికలో ఒకరి పేరు మిస్ అయింది అని అంటున్నారు.
ఆ పేరు ఎవరిది అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్విజ్ పోటీ ప్రశ్నను సోషల్ మీడియా వేదికగా జనాలకు వదిలారు. మరి ఆ పేరు ఎవరిది అయి ఉంటుంది అంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది అని అంటున్నారు.
ఇప్పటికే ఈ ఆహ్వాన పత్రికను చూసిన జనసేన నాయకులు క్యాడర్ ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. ఏపీలో మూడు పార్టీలు కలసి కూటమి కట్టాయి. బీజేపీ నుంచి మోడీ పేరు ఉంటే టీడీపీ నుంచి చంద్రబాబు పేరు ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆహ్వాన పత్రిక మీద ఉండాలి కదా అని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు
తాము కూటమికి విధేయులుగా పనిచేస్తున్నామే తప్ప తగ్గిపోవడానికి కాదని కొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారని అంటున్నారు. అంతే కాదు అమరావతి రాజధాని కోసం అలాగే రైతుల కోసం ఆయన ముందు నిలిచి మద్దతు ప్రకటించారని కూడా గుర్తు చేస్తున్నారు. అటువంటపుడు తమ నాయకుడికి తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.
పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండాలని బలంగా కోరుకుంటున్నారని అంత మాత్రం చేత ఆయనని తీసి పక్కన పెట్టడం న్యాయం కాదు కదా అని అంటున్నారు. తాము ఒక స్వతంత్ర పార్టీగా ఉన్నామని ఎవరికీ తాము తగ్గి ఉండాల్సింది లేదని అంటున్నారు.
మొత్తానికి చూస్తే పవన్ పేరు ఆహ్వాన పత్రిక మీద లేకపోవడం సోషల్ మీడియాలో రాజకీయ దుమారమే రేపుతోంది. ఇది వైసీపీకి మంచి ఆయుధంగా మారుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్న పవన్ కి తెలియకుండా ఆయనతో ఈ విషయాల మీద చర్చించకుండా ఆహ్వాన పత్రికను ఎవరూ ముద్రించరని అంటున్నారు.
చంద్రబాబు మోడీల పట్ల ఎంతో అభిమానం ఉన్న పవనే ఆ రెండు పేర్లూ ఆహ్వాన పత్రికలో ఉంటే చాలు అని అనుకుని ఉంటారని అంటున్నారు. పవన్ ఈ విషయంలో తప్పు పెట్టుకోరని వివాదం కూడా చేయరని అంటున్నారు. ఆయనకు ఉన్న సహనం క్యాడర్ కూడా అలవరచుకోవాలని వైసీపీ ట్రాప్ లో పడవద్దని పార్టీవాదులు సూచిస్తున్నారు అయితే తమ హీరో నాయకుడు అయిన పవన్ విషయంలో క్యాడర్ ఎవరు చెప్పినా తగ్గుతారా అన్నదే చర్చగా ఉంది.