Begin typing your search above and press return to search.

విశ్వనగరమే కాదు.. మరో ప్రపంచం కూడా..!! అమరావతి స్పెషల్

విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ సరికొత్త నగరానికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sept 2025 12:19 PM IST
విశ్వనగరమే కాదు.. మరో ప్రపంచం కూడా..!! అమరావతి స్పెషల్
X

రాజధాని అమరావతి పనులు పరుగులు తీస్తున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ సరికొత్త నగరానికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునిక సౌకర్యాలతో పర్యావరణ హితంగా నిర్మిస్తున్న రాజధానిలో ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు పురుడు పోసుకుంటున్నాయి. ఏఐ సిటీ ఆఫ్ ఇండియా, దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఇలా ఎన్నో అదనపు హంగులతో రాజధాని నగరం మినీ ప్రపంచాన్ని తలపించనుందని అంటున్నారు.

రాజధాని అమరావతిని మరింత విస్తరించాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రస్తుతం 33 వేల ఎకరాలలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనికి అదనంగా మరో 44 వేల ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచస్థాయి క్రీడా నగరాన్ని నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థలను అమరావతిలో నెలకొల్పేదిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే క్వాంటం వ్యాలీలో మార్చి నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో ఉంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. గతంలో 70 కీలక ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ ప్రణాళికను మరింత విస్తరించి 110 సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్న రహదారులకు కొన్ని సవరణలు చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 4 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించారు.

దీనిలోనూ ప్రభుత్వ కోర్ ఏరియా ఉండే ప్రాంతంలో రవాణా అడ్డంకులు లేకుండా నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టుల్లో రూ.50 వేల కోట్ల విలువైన 90 ప్రాజెక్టులకు టెండర్లను ఆమోదించారు. 78 ప్రాజెక్టు పనులను ఆయా సంస్థలకు కేటాయించారు. మొత్తంగా అమరావతిలో మరో ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రోడ్డు, రైలు కనెక్టివిటీ, బుల్లెట్ రైలు ప్రతిపాదన, హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 6 లేన్ల రహదారి నిర్మాణం, క్రిష్ణా నది నుంచి అమరావతి వరకు రోప్ వే, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

దీంతో రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 2015-16 మధ్య రాజధాని నిర్మాణానికి 64 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ, తర్వాత ఇది లక్ష కోట్లకు చేరింది. ఇక తాజాగా పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య కారణంగా ఈ వ్యయం రెండు లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేంద్రం 30 వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకుల ద్వారా రాష్ట్రానికి రుణంగా ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. గత బడ్జెట్ లో కేంద్రం 15000 కోట్లను గ్రాంటుగా ఇచ్చింది. మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 2 వేల కోట్లు కేటాయించింది. విరాళాల రూపంలో కొంత మొత్తం సేకరిస్తోంది. ఏదిఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్నం ఫలించేలా అమరావతి విశ్వనగరంలో మరో ప్రపంచమే ఆవిష్కృతం అయ్యేలా ఉందంటున్నారు.