విభజన చట్టంలో అమరావతి రాజధాని
విభజన చట్టం 2014 మార్చిలో అప్పటి యూపీఏ టూ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించింది. ఆనాటికి ఏపీ ఉమ్మడిగానే ఉంది.
By: Tupaki Desk | 8 May 2025 5:08 PMవిభజన చట్టం 2014 మార్చిలో అప్పటి యూపీఏ టూ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించింది. ఆనాటికి ఏపీ ఉమ్మడిగానే ఉంది. ఆ తరువాత అపాయింట్ డే పేరుతో జూన్ 2 నుంచి ఏపీ తెలంగాణాగా విడిపోయాయి. ఈ మధ్యలో దేశంలో ఎన్నికలు జరిగాయి. విభజన ఏపీలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించింది ఆ తరువాత చంద్రబాబు తమ కేబినెట్ సహచరులు కీలక నేతలతో వేసిన ఒక కమిటీ ద్వారా అమరావతి రాజధానిని గురించారు.
దానినే చివరికి రాజధానిగా ఎంపిక చేస్తూ అసెంబ్లీలో ఆమోదించారు. ఇంతవరకూ కధ బాగున్నా అమరావతి రాజధానికి చట్టబద్ధత లేదు, గెజిట్ నోటిఫికేషన్ అంతకంటే లేదు. 2024 జూన్ 2 వరకూ ఏపీ తెలంగాణాకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆ విధంగానే విభజన చట్టంలో చేర్చి ఆమోదించారు.
దాంతో అమరావతి అన్న ప్రసక్తి ఎక్కడా చట్టబద్ధంగా లేదు. అదే వైసీపీకి ఒక అవకాశంగా మారింది. అందుకే 2019లో అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ వైసీపీ మూడు ముక్కలాట ఆడింది. అయితే వైసీపీ ఆటలు సాగకుండా టీడీపీ ప్రజా సంఘాలతో కలసి చేసిన పోరాటంలో విజయం సాధించింది.
ఇక 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో మళ్ళీ అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఒక డౌట్ వచ్చింది. 2029లో పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే అపుడు అమరావతి గతేమి కాను అన్నదే. దాంతో అమరావతికి చట్టబద్ధత కల్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులే కాకుండా భూములు ఇచ్చిన రైతులు అలాగే పెట్టుబడులు పెట్టే వ్యాపారులు కూడా అస్థిరత్వంతోనే ఉండాల్సి వస్తుందని అంటున్నారు.
దాంతో ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికే రంగం సిద్ద్ధం చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి తొందరలో పంపనుంది.
ఆ మీదట దానిని పార్లమెంట్ లో పెట్టి విభజన చట్టంలో సవరణలను ఆమోదిస్తారు అని అంటున్నారు. ఇక రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తూ కీలక ప్రకటన చేస్తారు. దాంతో అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మంత్రి వర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో భూములు ఇచ్చిన రైంతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.