అమరావతి సప్న సాకారం.. 'తొలి' అడుగు పడింది!
''ఏపీ రాజధాని అమరావతి.. ప్రతి ఒక్కరి కల. ఈ మాట ఎవరో అనలేదు. గత ఏడాది ప్రజలే తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారు.''
By: Tupaki Desk | 7 April 2025 5:11 PM IST''ఏపీ రాజధాని అమరావతి.. ప్రతి ఒక్కరి కల. ఈ మాట ఎవరో అనలేదు. గత ఏడాది ప్రజలే తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారు.'' అని సీఎం చంద్రబాబు గతంలో చెప్పినట్టు.. ఈ కల సాకారం అయ్యేందుకు.. చంద్రబాబు చేసిన కృషి ఫలించింది. `తొలి` అడుగు పడింది. ఎప్పుడెప్పుడా అని చంద్రబాబు.. మంత్రులు.. యావత్ రాష్ట్రం కూడా.. కళ్లు కాయలు చేసుకుని మరీ ఎదురు చూసిన అమరావతికి నిధులు వచ్చాయి.
ఒకే సారి సోమవారం కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) ఖాతాలోకి 4 వేల కోట్లకు పైగా సొమ్ములు వచ్చి చేరాయి. ఈ మేరకు కేంద్రం నుంచి వెంటనే ఫ్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి సమాచారం కూడా చేరింది. దీంతో రాజధాని పనులు.. ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. కాంట్రాక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాడు నేడు అంటూ.. నిధుల రాక కొంత సమయం పట్టింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మరోసారి ఈ విషయంపై చర్చించారు.
ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 3535 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖాతాలోకి వచ్చాయి. వీటికితోడు.. కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రస్తుత సంవత్సరంలో 1500 కోట్లను గ్రాంటు గా రాజధానికి ఇస్తామని.. బడ్జెట్‌లోనే ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ నిధులు పనులు మొదలయ్యాక ఇస్తామని .. అదే సమయంలో ప్రకటించింది. కానీ.. చంద్రబాబు ఈ విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వానికి విన్నవించారు.
ఈ క్రమంలో కేంద్రం ఇస్తామని చెప్పిన 1500 కోట్ల రూపాయలలో రెండు భాగాలుగా చేసి.. తొలి భాగం రూ.750 కోట్లను తాజాగా విడుదల చేసింది. దీంతో మొత్తం 3535+750 కోట్లు కలిపి.. 4285 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి చేరాయి. దీంతో అమరావతికి రావాల్సిన రుణ సహాయంలో తొలి అంకం పూర్తయింది. ఈ నిధులను వినియోగించి చేపట్టే పనులకు సంబంధించి వివరాలు ఇచ్చాక..మరిన్ని నిధులను విడుదల చేయనున్నారు.
