అమరావతిపై అపోహలు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై గత వారం రోజులుగా అపోహలు హల్చల్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 April 2025 3:34 PM ISTనవ్యాంధ్ర రాజధాని అమరావతిపై గత వారం రోజులుగా అపోహలు హల్చల్ చేస్తున్నారు. ప్రధానంగా 33 వేల ఎకరాలను రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతులు.. నిరసనలు, ధర్నాలు చేస్తున్నా రు. తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పనులు చేయడం లేదని.. తమకు ఇస్తామన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని.. అదే విధంగా ఏడాది కాలంగా బకాయి ఉన్న కౌలు ను కూడా చెల్లించడం లేదని వారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజధానిలోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి విపక్ష వైసీపీ నాయకులు కూడా తోడు కావడంతో సహజంగానే ఈ నిరసనలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరో 30 వేల ఎకరాలను కూడా.. ప్రభుత్వం సమీకరించేందుకు సిద్ధమైంది. ఇది మరో వివాదంగా మారింది. ముందు తమకు న్యాయం చేయకుండా.. కొత్త గా భూములు ఎలా తీసుకుంటారంటూ.. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ఉద్యమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి నారాయణ స్పందించారు. ప్రభుత్వం రైతులకు గతంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పారు. రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని.. ఒకప్పుడు రాజధానిని కాదన్నవారు చెప్పిన వారి మాటలు వింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సరికాదని.. రైతులు సంయమనం పాటించాలని విన్నవించారు. రైతుల భూముల ధర పెరగాలంటే.. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రావాల్సి ఉందన్న ఆయన ఈ క్రమంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడితే.. ప్రపంచ దేశాలతో అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని.. తద్వారా.. ఇక్కడ భూములకు మరింత ధరలు పెరిగి.. రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ఓపిక పట్టాలని.. భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని.. ప్రభుత్వం ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉందని వివరించారు. ఆందోళనలు, ధర్నాలతో విపక్ష వైసీపీ మాయలో పడకూడదని ఆయన కోరారు. మరి రైతులు ఏం చేస్తారో చూడాలి.
