Begin typing your search above and press return to search.

చ‌ట్ట‌బ‌ద్ధ‌త మేలు: ఫ‌స్ట్ డే 1000 ఎక‌రాలు!

ఇలా తొలిరోజే సుమారు 1000 ఎకరాలకు పైగా భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

By:  Garuda Media   |   11 April 2026 4:26 PM IST
చ‌ట్ట‌బ‌ద్ధ‌త మేలు:  ఫ‌స్ట్ డే 1000 ఎక‌రాలు!
X

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం ఏముంటుందిలే.. ఇదంతా కేవలం రాజకీయం కోసం చేస్తున్న ప్రక్రియ.. అంటూ వైసీపీ నాయకులు సహా కొంతమంది వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని రెండో విడత విస్తరణలో భాగంగా రైతుల నుంచి భూములు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి అమరావతికి లభించిన చట్టబద్ధత కలిసి వచ్చింది.

నిన్న మొన్నటివరకు భూములు ఇచ్చేందుకు వెనుకాడిన కొంతమంది రైతులు తాజాగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. శుక్రవారం రాజధాని అమరావతిలో నిర్వహించిన రెండో దశ భూ సమీకరణ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చి తమ భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాదు గతంలో ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టిన కొంతమంది రైతు సంఘాల నాయకులు, రైతులు సైతం తాజాగా రాజధానికి చట్టబద్ధత కల్పించడంతో వారి డిమాండ్లను సైతం పక్కనపెట్టి భూములు ఇచ్చేందుకు సిద్ధపడటం విశేషం అనే చెప్పాలి.

ఇలా తొలిరోజే సుమారు 1000 ఎకరాలకు పైగా భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వారు సంసిద్ధత పత్రాలను మంత్రి నారాయణ సహా సి ఆర్ డి ఏ అధికారులకు అప్పగించారు. రాజధాని పరిధిలోని పెదపరిమి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రైతులు ఈ విధంగా స్పందించడం ఇటీవల కాలంలో తొలిసారి అనే చెప్పాలి. గత ఎనిమిది మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని విస్తరణ చేపట్టాలని భావించింది. మరిన్ని భూములను సేకరించాలని కూడా నిర్ణయించుకుంది.

కానీ రైతులు దీని విషయంలో కొంత వెనక్కి తగ్గారు. అమరావతికి చట్టబద్ధత లేదని, రేపు మళ్లీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బిల్లును పాస్ చేయడంతో పాటు పార్లమెంటు సభలోనూ అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దీనిని సాధించారు. ఫలితంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది.

ఈ ప్రభావం అమరావతి రైతులపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇకమీదట భూములు ఇచ్చేందుకు ఎవరు వెనకాడాల్సిన అవసరం లేని పరిస్థితిని కూడా కల్పించింది. రెండో దశ భూ సమీకరణలో దాదాపు 40 వేల ఎకరాలకు పైగా భూమిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. అదేవిధంగా పరిశ్రమలు, పెట్టుబడి పెట్టే వారికి ఇక్కడ భూములను కేటాయించనున్నారు.