Begin typing your search above and press return to search.

స్కిల్ కేసులో కీలక పరిణామం.. సిమెన్స్ మాజీ సీఇవోకు సుప్రీంలో బెయిల్!

ఆ సమయంలో సీమెన్స్‌ ప్రతినిధిగా ఉన్న ఆమె భర్త స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 8:21 AM GMT
స్కిల్  కేసులో కీలక పరిణామం.. సిమెన్స్  మాజీ సీఇవోకు సుప్రీంలో బెయిల్!
X

ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలమైన ఇష్యూగా మారింది స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్, సుమారు 52 రోజుల జైలు జీవితం మొదలైన పరిణామాల్తో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అపర్ణ... భర్త గంటి వెంకట సత్య భాస్కర్‌ ప్రసాద్‌ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదొక కీలక పరిణామం అనే చెప్పాలి.

అవును... ఉత్తరప్రదేశ్ కేడర్‌ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అపర్ణ భర్త భాస్కర్ ప్రసాద్‌ కు సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరైంది. వాస్తవానికి భాస్కర్ ప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ గతంలోనే అరెస్ట్ చేసింది. సీమెన్స్ డైరెక్టర్‌ లలో ఒకరిగా పనిచేస్తున్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచారని ఆరోపిస్తూ ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాస్కర్ ప్రసాద్‌ ను ఏ-35గా సీఐడీ గుర్తించింది.

వాస్తవానికి అపర్ణ ఇదివరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో సీమెన్స్‌ ప్రతినిధిగా ఉన్న ఆమె భర్త స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో ఆయన ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి చూపారనే ఆరోపిస్తూ ఈ కేసులో నిందితుడిగా చేర్చి సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

అయితే ఏసీబీ కోర్టు అతన్ని రిమాండ్ చేయడానికి నిరాకరించింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్, అవినీతి నిరోధక చట్టం అతనికి వర్తించదని పేర్కొంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు అవినీతి నిరోధక చట్టం నిబంధనలు వర్తించవని వాదించింది. ఈ కేసులో మిగిలిన సెక్షన్లకు ఏడేళ్లలోపు శిక్ష విధించినందున, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 41ఎలోని నిబంధనలను అనుసరించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా అతనికి బెయిల్‌ మంజూరు చేశారు.

దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో... ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది! ఆ తర్వాత సత్యభాస్కర్‌ ప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా హైకోర్టు న్యాయమూర్తి కొట్టేశారు. దీంతో.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సత్యభాస్కర్‌ ప్రసాద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఇందులో భాగంగా... ఏపీ సీఐడీ పోలీసులు 2021 డిసెంబరు 9న నమోదుచేసిన 29/2021 ఎఫ్‌ఐఆర్‌ లో ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తునకు మాత్రం పూర్తిగా సహకరించాలని సత్య భాస్కర్ ప్రసాద్‌ కు కండిషన్ పెడుతూ విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. దీంతో... ఆయనకు ఆగస్టు 22న ఇచ్చిన ముందస్తు బెయిల్‌ ను పూర్తిస్థాయిలో ఖరారు చేస్తూ సుప్రీం వెల్లడించింది.

కాగా... ఇదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలతో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇదే సమయంలో స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్ చేశారు. ఆ తీర్పు సుప్రీంలో ఈ నెల 8న వెల్లడయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది!