Begin typing your search above and press return to search.

దక్షిణాదికి ఎంఐఎం ఎందుకు దూరమంటే..?

హైదరాబాద్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న పార్టీ అంటే ఒక్కటి మాత్రమే అదే ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం).

By:  Tupaki Desk   |   18 Feb 2026 5:00 PM IST
దక్షిణాదికి ఎంఐఎం ఎందుకు దూరమంటే..?
X

హైదరాబాద్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న పార్టీ అంటే ఒక్కటి మాత్రమే అదే ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). పాతబస్తీ గల్లీల్లో ప్రారంభమైన పార్టీ రాజకీయ ప్రస్థానం.. నేడు పార్లమెంట్ వరకూ విస్తరించింది. హైదరాబాద్‌లో పుట్టి, తెలంగాణలో బలమైన స్థానం సంపాదించి, తర్వాత మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అడుగుపెట్టి తన ప్రాభవాన్ని విస్తరించాలనే స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది.

దక్షిణాదిన చల్లబడుతున్న పార్టీ..

అయితే ఇక్కడ ఒక ప్రశ్న కలగక మానదు.. ఈ పార్టీ ఎందుకు దక్షిణాది మొత్తం మీద సమాన దూకుడు కనిపించడం లేదు? అని. తమిళనాడు, కర్ణాటకలో పరిమితంగా మాత్రమే పోటీ చేస్తూ.. కేరళలో పూర్తిగా దూరంగా ఉంది? హైదరాబాద్‌లో ఎంఐఎం స్థిర శక్తి. పార్లమెంట్ సీటు దాదాపు కంచుకోట. అసెంబ్లీలో ఏడు స్థానాలు దాదాపు స్థిరంగా కొనసాగుతుండడం ఆ పార్టీ స్థానిక బలం ఎంత పటిష్ఠమో చెప్పకనే చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 45-50 డివిజన్ల వరకూ గెలుపు సాధించగల సామర్థ్యం ఉంది. అవసరమైనప్పుడు కాంగ్రెస్‌కు, మరికొన్ని సందర్భాల్లో అధికార పార్టీకి మద్దతు ఇస్తూ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తోంది.

ఉత్తరాదిలో స్థానాలు గెలుస్తున్న పార్టీ..

తెలంగాణ బయట చూస్తే.. మహారాష్ట్రలో ఔరంగాబాద్ (ఇప్పటి ఛత్రపతి సంభాజీ నగర్) గెలుపు పార్టీకి పెద్ద మైలురాయి. 2019లో రెండు అసెంబ్లీ సీట్లు, 2024లో ఒక సీటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. బిహార్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు తన ఖాతాలో వేసుకొని ఉత్తరాదిలో నేనున్నానని హింట్ ఇచ్చిన పార్టీ. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోనూ స్థానిక స్థాయిలో పోటీ చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.

కేరళలలో వ్యూహాత్మక ఎత్తుగడ..

అంటే ఎంఐఎం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తుంది.. ముస్లిం ఓటర్లు కేంద్రీకృతంగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవడం. అయితే ఇదే వ్యూహం కేరళలో ఎందుకు కనిపించడం లేదు? కేరళలో ముస్లిం లీగ్ అనే బలమైన రాజకీయ శక్తి ఇప్పటికే ఉంది. దశాబ్దాల చరిత్ర, కాంగ్రెస్‌తో సుదీర్ఘ మైత్రి, ప్రభుత్వాల ఏర్పాటు నుంచి కేంద్ర రాజకీయాల వరకూ కీలక పాత్ర ఇవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు ప్రత్యేక స్థానం కల్పించాయి. పార్లమెంట్‌లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ లీగ్‌కు బలమైన పునాది ఉంది. ముస్లిం ఓటర్లలో విభజనకు అవకాశం తక్కువ.

ఎంఐఎం ప్రవేశిస్తే అక్కడ ప్రత్యక్ష పోటీ ముస్లిం లీగ్‌తోనే అవుతుంది. అదే సమయంలో అది పరోక్షంగా బీజేపీ లేదా వామపక్షాలకు లాభం చేకూర్చే అవకాశం లేకపోలేదు. అందుకే వ్యూహాత్మకంగా చూస్తే.. కేరళలో పోటీ చేయకపోవడం ఓ రాజకీయ లెక్క. ఓవైసీ తరహా వాదనలు, లీగ్ అనుభవం ఇవి రెండూ కలిస్తే అభిప్రాయాల్లో సారూప్యత ఉన్నా, ఓటు బేస్‌లో పోటీ తప్పదు.

తమిళనాడులో స్థానిక ఎన్నికల్లో పోటీ..

ఇక తమిళనాడు, కర్ణాటక విషయానికొస్తే.. అక్కడ పార్టీ పూర్తిగా దూరం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటూ, కొన్నిచోట్ల విజయం సాధిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. అంటే ‘అకస్మాత్తుగా దూకుడు’ కంటే ‘నెలనెలా విస్తరణ’ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొత్తానికి ఎంఐఎం లక్ష్యం దేశవ్యాప్త రాజకీయ గుర్తింపు. కానీ అది ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా కాకుండా.. స్థానిక సామాజిక-రాజకీయ వాస్తవాల ఆధారంగా అడుగులు వేస్తోంది. బలం ఉన్న చోట దూకుడు.. బలమైన ప్రత్యర్థి ఉన్న చోట ఆచితూచి అడుగు ఇదే పార్టీ వ్యూహం అనిపిస్తోంది. అందుకే ప్రశ్నకు సమాధానం ఒకటే.. ఇది వెనుకడుగు కాదు, వ్యూహాత్మక నిరీక్షణ.