Begin typing your search above and press return to search.

విద్యా రంగంలో సరికొత్త విప్లవం.. తరగతి గదుల్లోకి ఏఐ టెక్స్ట్ బుక్స్!

లూయిస్ వాన్ ఆన్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ ట్యూటర్లు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అందించగలవు.

By:  Tupaki Desk   |   20 May 2025 5:00 PM IST
AI to Replace Teachers? Duolingo CEO Bold Prediction
X

ఇక బడుల్లో టీచర్లు కనుమరుగు కాబోతున్నారా ? పాఠాలు చెప్పడానికి రోబోలు రాబోతున్నాయా? డ్యులింగో సీఈవో లూయిస్ వాన్ ఆన్ చేసిన ఒక సంచలన ప్రకటన విద్యా రంగాన్ని కుదిపేస్తోంది. భవిష్యత్తులో బోధన మొత్తం ఏఐ ట్యూటర్లే చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. బోధన రంగంలో రాబోయే రోజుల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. పాఠాలు చెప్పడానికి ఇకపై మనుషులు అవసరం లేకుండా పోతుందట. భవిష్యత్తులో టీచర్ల స్థానాన్ని కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) భర్తీ చేయనుందని ప్రముఖ భాషా అభ్యాస వేదిక డ్యులింగో సీఈవో లూయిస్ వాన్ ఆన్ తెలిపారు. భవిష్యత్తులో బోధన మొత్తం ఏఐ ట్యూటర్లే చేస్తారని ఆయన సంచలన అంచనా వేశారు. ఏఐ వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఎక్కువగా పిల్లల సంరక్షణ (చైల్డ్ కేర్), పర్యవేక్షణ (సూపర్ విజన్) వంటి విధులు మాత్రమే ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, దక్షిణ కొరియాలో ఇప్పటికే తరగతి గదుల్లో ఏఐ టెక్స్ట్ బుక్స్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు విద్యా రంగంలో ఒక కొత్త చర్చకు దారితీశాయి.

లూయిస్ వాన్ ఆన్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ ట్యూటర్లు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అందించగలవు. ప్రతి విద్యార్థి అవసరాలు, వారి వేగం, వారి బలహీనతలను గుర్తించి, దానికి అనుగుణంగా పాఠాలను రూపొందించగలవు. ఒకే తరగతి గదిలో ఉన్నప్పటికీ, ప్రతి విద్యార్థికి వారి స్థాయికి తగిన విధంగా బోధన అందుతుంది. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఏఐ ట్యూటర్లు 24/7 అందుబాటులో ఉండగలవు, విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

అయితే, ఏఐ ట్యూటర్లు వచ్చిన తర్వాత టీచర్ల పాత్ర పూర్తిగా మారిపోతుందని లూయిస్ వాన్ ఆన్ అంటున్నారు. వారి ప్రధాన బాధ్యత బోధన కాకుండా పిల్లల శారీరక, మానసిక సంరక్షణ, అలాగే వారి అభ్యాస ప్రక్రియను పర్యవేక్షించడం వంటి వాటికే పరిమితం కావచ్చు. టీచర్లు ఒక రకంగా పిల్లలకు మెంటర్‌లుగా, గైడ్‌లుగా మారే అవకాశం ఉంది.

దక్షిణ కొరియాలో ఏఐ టెక్స్ట్ బుక్స్ వినియోగం అనేది ఈ దిశగా ఒక ముందడుగుగా చూడవచ్చు. సాంప్రదాయ పాఠ్యపుస్తకాలకు బదులుగా, ఏఐ ఆధారిత టెక్స్ట్ బుక్స్ విద్యార్థుల అభ్యాస స్థాయిని విశ్లేషించి, వారికి మరింత అనుకూలమైన కంటెంట్‌ను అందిస్తాయి. ఇది విద్యార్థులు మరింత ఆసక్తిగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏఐ ట్యూటర్లు పూర్తిగా టీచర్ల స్థానాన్ని భర్తీ చేయగలవా అనే ప్రశ్న ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడంతో పాటు, వారిలో నైతిక విలువలు, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడంలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ కేవలం సమాచారాన్ని అందించగలదు. కానీ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో ఏర్పరుచుకునే మానవీయ సంబంధాన్ని, వారు అందించే స్ఫూర్తిని ఏఐ భర్తీ చేయగలదా అనేది వేచి చూడాలి.