ఏఐ యుగంలోనూ ఉద్యోగులకు రిలీఫ్ లేదా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే పని భారం తగ్గి, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని అందరూ అనుకున్నారు.
By: Madhu Reddy | 3 March 2026 10:00 PM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే పని భారం తగ్గి, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 75 శాతం పనులను AI చేస్తున్నప్పటికీ, ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గకపోగా ఐదు రెట్లు పెరిగిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. టెక్ దిగ్గజ సంస్థల్లో జరుగుతున్న ఈ వింత మార్పులు, పెరిగిన పని ఒత్తిడి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు చూద్దాం..
ఏఐ పనిని సులభం చేసింది.. కానీ తీరిక లేకుండా చేస్తోంది:
ఆండ్రూ యంగ్, ఫైబ్ వ్యవస్థాపకుడు షేర్ చేసిన వివరాల ప్రకారం, ఒక పెద్ద టెక్ కంపెనీలో సీనియర్ ఉద్యోగి చేసే పనిలో దాదాపు 75 శాతం ఇప్పుడు ఏఐ తోనే పూర్తవుతోంది. ప్రజెంటేషన్ స్లైడ్స్, ఎక్సెల్ షీట్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చివరకి డేటా అనాలిసిస్ వంటి పనులన్నీ ఏఐ చిటికెలో చేసేస్తోంది. అయితే, పని వేగంగా పూర్తవుతున్నా ఉద్యోగులకు ఫ్రీ టైమ్ మాత్రం దొరకడం లేదు. కారణం ఏమిటంటే, పని చేసే వేగం పెరగడంతో మేనేజ్‌మెంట్ ఇచ్చే టార్గెట్లు కూడా పెరిగిపోయాయి. మునుపటి కంటే ఇప్పుడు ప్రతి ఉద్యోగి నుంచి 5 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కంపెనీలు ఆశిస్తున్నాయి.
ఎగ్జిక్యూషన్ నుంచి స్ట్రాటజీ వరకు.. మెంటల్ టార్చర్:
ఒకప్పుడు ఉద్యోగికి పని చేయడమే ప్రధానంగా ఉండేది, కానీ ఇప్పుడు అంతా స్ట్రాటజీ వైపే మళ్లింది. "75 శాతం పని ఏఐ చేస్తున్నా ఇంకా పని భారంగా ఉందంటే, మనం సమయాన్ని ఆదా చేస్తున్నామా లేక మన మెదడును ఖాళీ చేసుకుంటున్నామా?" అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక శారీరక శ్రమ తగ్గినప్పటికీ, ఏం చేయాలి, ఏది బాగుంటుంది అని ఆలోచించే మెంటల్ టాస్క్ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పని పూర్తి చేసే బాధ్యత ఏఐ తీసుకుంటే, ఆ పని సరైనదా కాదా అని నిర్ణయించే బాధ్యత మనిషిపై పడింది. ఇక అలాంటప్పుడు నిరంతరం ఆలోచించాల్సి రావడం ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పెరిగిన అంచనాలు.. పెను సవాలుగా మారిన కెరీర్:
ఏఐ సాయంతో పని వేగంగా జరుగుతుందని తెలిసిన వెంటనే, లీడర్‌షిప్ టీమ్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఒక వ్యక్తి చేసే పనిని ఇప్పుడు ఐదుగురితో సమానంగా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అవుట్‌పుట్ ఎంత పెరుగుతోందో, దానికి తగ్గట్టుగా ఒత్తిడి అంతకంటే వేగంగా పెరుగుతోంది. ఉద్యోగి అడ్డంకి ఇప్పుడు పని చేయడంలో లేదు, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంది. దీంతో ఉద్యోగులు సాంకేతికతను వాడుకుని హాయిగా రిలాక్స్ అవ్వాల్సింది పోయి, మేనేజ్‌మెంట్ కు పెరిగిన అంచనాలను అందుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడాల్సి వస్తోంది.
ఏఐ అనేది మనకు సాయం చేసే సాధనంగా ఉండాలి కానీ, అది మనల్ని మరింత బానిసలుగా మార్చకూడదు. సాంకేతికత పెరిగినప్పుడు పని భారం తగ్గాలి కానీ, అంచనాలు పెరిగి మనుషులను మరి యంత్రాలు లాగ మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇక కంపెనీలు కేవలం అవుట్‌పుట్ మీద మాత్రమే కాకుండా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది అంటున్నారు నిపుణులు.
