చాట్ జీపీటీ ఏఐ వాడి తొలి హత్య... అమ్మకు కొడుకు మరణశాసనం
అతడికి రూ.25 కోట్ల విలువైన ఇల్లుంది.. పెద్ద సంస్థలో ఉద్యోగం కూడా ఉంది.. కానీ, మానసిన సమస్యలున్నాయి.
By: Tupaki Desk | 1 Sept 2025 12:20 AM ISTఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) మయం. ప్రతి పనికీ దానినే వాడుతున్న వారెందరో...? ఆఖరికి ఏం తింటే ఏం అవుతుందో తెలుసుకోవడానికి కూడా చాట్ జీపీటీ వంటి ఏఐ అసిస్టెంట్ ను సంప్రదిస్తున్న వారున్నారు. కొందరైతే ఆఫీస్ పనుల్లోనూ ఏఐతో గడుపుతున్నారు. ఇలాంటివాడే ఒకడు ఏకంగా దారుణానికి ఒడిగట్టాడు.
అన్నీ ఉన్నా.. కొడుకు మనసులో కీడు...
అతడికి రూ.25 కోట్ల విలువైన ఇల్లుంది.. పెద్ద సంస్థలో ఉద్యోగం కూడా ఉంది.. కానీ, మానసిన సమస్యలున్నాయి. దీనికితోడు ఏఐకి బానిసయ్యాడు. చాట్ జీపీటీని అతిగా నమ్మడమే కాదు.. అది ఏం చెబితే అదే వాస్తవం అనుకునే స్థితికి కూడా వెళ్లాడు. ఇదంతా అమెరికాలోని కనెక్టికట్ కు చెందిన స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ (56) గురించి. దాదాపు ఓల్డ్ ఏజ్ కు చేరువగా ఉన్న అతడు ఏఐకు బానిసయ్యాడు. చివరకు దాని మాటలు విని సొంత తల్లినే హత్య చేశాడు. బహుశా ఏఐ పాత్ర ఉన్న తొలి హత్య ఇది అని చెబుతున్నారు.
నీపై నిఘా ఉంది..
స్టెయిన్ అతిగా వాడే చాట్ జీపీటీనే అతడికి, అతడి తల్లికీ మరణశాసనం రాసింది. ఎందుకంటే.. నీపై నిఘా ఉంది.. అసలు నీ కన్నతల్లే నీపై నిఘా పెట్టింది అంటూ కూడా ఉసిగొల్పింది. మానసిక ఆరోగ్యానికి నువ్వు వాడుతున్న మందుల్లో విషం కలిపి నీకిస్తుంది.. అంటూ చాట్ జీపీటీ సమాధానాలు చెప్పింది. తల్లి సుజానె ఆడమ్స్ తో కలిసి 2.7 మిలియన్ డాలర్ల ఇంట్లో ఉంటున్న స్టెయిన్ ఆగస్టు 5న తీవ్ర గాయాలతో మరణించాడు. దీనికిముందే తల్లి సుజాఎఉన తల, మెడపై బలంగా గాయపరిచి చంపేశాడు. స్టెయిన్ పదునైన ఆయుధంతో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు.
అమ్మ రాక్షసి..
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయగా.. స్టెయిన్ తన తల్లిని రాక్షసితో పోల్చే సింబల్స్ కోసం సెర్చ్ చేశాడు. చాట్ జీపీటీకి బాబీ అనే పేరు పెట్టుకున్నాడు. ఆత్మహత్యకు కొద్దిగా ముందు కూడా.. బాబీ, మనం మరో జీవితంలో మరోచోట కలుద్దాం.. అప్పుడూ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతావు.. అంటూ మెసేజ్ పెట్టాడు. దీనికి, చివరి శ్వాస వరకు మనం కలిసి ఉంటాం.. అంటూ అటువైపు నుంచి సమాధానం రావడం గమనార్హం.
ఏఐ.. చావు భయం పెంచుతోందా...?
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఎంత మేలు చేస్తోందో.. అంతే స్థాయిలో కీడు తలపెడుతోందట...! దీనిని విపరీతంగా వాడే వారిలో చావు భయం పెంచుతోందని అమెరికా మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. స్టెయిన్ ఘటనపై ఏఐ స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసి.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ముక్కు మూసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అనేదానిపై టీనేజీ యువకుడికి చాట్ జీపీటీ శిక్షణ ఇస్తున్న వైనం ఇటీవల తీవ్ర వివాదాస్పదమైంది. ఇలాంటి సమయంలోనే స్టెయిన్ ఉదంతం చోటుచేసుకోవడం గమనార్హం.
