Begin typing your search above and press return to search.

ఏఐ మేజిక్.. వందేళ్లకు పైనే బతికించేస్తుందట

పెద్దోళ్లను కలిస్తే.. నిండు నూరేళ్లు బతకాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు.. నూరేళ్లు బతకాలన్న దీవెనలు అందిస్తుంటారు. మనిషికి పూర్ణాయుర్ధాయం వందేళ్లుగా చెప్పటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 July 2025 5:00 PM IST
ఏఐ మేజిక్.. వందేళ్లకు పైనే బతికించేస్తుందట
X

పెద్దోళ్లను కలిస్తే.. నిండు నూరేళ్లు బతకాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు.. నూరేళ్లు బతకాలన్న దీవెనలు అందిస్తుంటారు. మనిషికి పూర్ణాయుర్ధాయం వందేళ్లుగా చెప్పటం తెలిసిందే. మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశ ప్రజల సగటు జీవితకాలం 32 ఏళ్లు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో మనిషి జీవితకాలం తక్కువగా ఉండేది. వైద్య రంగంలో చేపట్టిన పరిశోధనలు.. మార్పులు మనిషి జీవిత కాలాన్ని పెంచేలా చేశాయి.

రకరకాల వ్యాధులకు చెక్ పెట్టే టీకాలు అందుబాటులోకి రావటంతో మనలో ఆరోగ్యం పట్ల స్ప్రహ పెరిగింది. ప్రస్తుతం భారతీయుల సగటు జీవితకాలం 70 ఏళ్లు కాగా.. హాంకాంగ్.. దక్షిణ కొరియా ప్రజల సగటు జీవితకాలం 85 ఏళ్లుగా తేల్చారు. మరి.. రానున్న రోజుల్లో మనిషి జీవితకాలం ఎంతమేర పెరిగే వీలుంది? అన్నదిప్పుడు చర్చగా మారింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ‘కృత్రిమమేధ’ ఎంట్రీతో మనిషి జీవితకాలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఒక అంచనా ప్రకారం 2030 నాటికి.. అంటే రానున్న ఐదేళ్లలో మనిషి జీవితకాలం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కొందరు మనిషి ఆయుర్దాదం 150ఏళ్లకు పెరుగుతుందని చెప్పినా.. అంత కాకున్నా.. వందేళ్లకు పైనే హాయిగా జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావటం.. కృత్రిమమేధతో వైద్య రంగం మరింత దూసుకెళ్లే వీలుందని.. ఇవన్నీ మనిషి జీవితకాలాన్ని పెంచేందుకు సాయం చేస్తాయని చెబుతున్నారు.

శరీరంలోని క్రోమోజోముల చివరిభాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు మయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది.ఈ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించొచ్చు. సైడ్ ఎఫెక్టులు లేకుండా టెలోమియర్ల పొడుగు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇవి ఫలిస్తే మనిషి జీవితకాలం మరింత పెరుగుతోంది. ఇందుకు ఏఐ సాయం చేస్తుందని చెబుతున్నారు.

మనిషిలో వయసు పెరిగే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రిస్తుందన్న అంచనాలు ఉన్నాయి, అప్పటికి కృత్రిమమేధతో పని చేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని.. ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఏఐ సాయంతో సమస్యను గుర్తించి.. మరమ్మత్తు చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు. మనిషి మెదడులోని సమాచారాన్ని కూడా బ్యాకప్ లా తీయటంలో ఏఐ సాయం చేస్తుందని చెబుతున్నారు అదే జరిగితే.. మనిషి భౌతికంగా లేకున్నా మానసికంగా చిరంజీవిగా మిగిలినట్లు చేయొచ్చని చెబుతున్నారు. మొత్తంగా అందుబాటులోకి వస్తున్న ఏఐతో.. మనిషి నూరేళ్ల కంటే ఎక్కువే బతికేసే పరిస్థితి.