ఏఐ దెబ్బకు అమెరికాలో నెలకు 16 వేల ఉద్యోగాలు మాయం!
గత కొన్నేళ్లుగా టెక్ రంగంలో అగ్రగాములైన మెటా, మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ ఆధారిత వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
By: A.N.Kumar | 26 May 2026 4:00 AM ISTప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవం ఏ రేంజ్‌లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ టెక్నాలజీ విప్లవం ఒకవైపు సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంటే.. మరోవైపు ఉద్యోగాల మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో ఏఐ కారణంగా ప్రతి నెలా వేలాది మంది రోడ్డున పడుతున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్ మ్యాన్ సాచ్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. అమెరికాలో AI ప్రభావంతో ప్రతి నెలా సుమారు 16,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నివేదిక ఇప్పుడు ప్రపంచ టెక్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆటోమేషన్ వైపు టెక్ దిగ్గజాల అడుగులు
గత కొన్నేళ్లుగా టెక్ రంగంలో అగ్రగాములైన మెటా, మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ ఆధారిత వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మానవ వనరులపై ఆధారాన్ని తగ్గించుకుంటూ.. వేగంగా ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం ఉద్యోగ కోతల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఏ ఉద్యోగాలకు ముప్పు ఎక్కువగా ఉందంటే..?
రిపోర్ట్ ప్రకారం.. ఏఐ, చాట్‌బాట్ల రాకతో కొన్ని నిర్దిష్ట విభాగాల్లోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా నష్టపోతున్న రంగాలు చూస్తే.. టెలిఫోన్ ఆపరేటర్లు & కస్టమర్ సపోర్ట్ కు దెబ్బపడింది. అడ్వాన్స్‌డ్ చాట్‌బాట్లు, వర్చువల్ అసిస్టెంట్ల కారణంగా ఈ విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వేగంగా, కచ్చితత్వంతో డేటాను ప్రాసెస్ చేసే ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడమే దీనికి కారణం. ఆటోమేటెడ్ కోడింగ్ టూల్స్ రావడంతో ప్రాథమిక స్థాయి కోడింగ్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుతోంది. "సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం తప్పనిసరి అవుతోంది’’ అని స్పష్టం చేస్తున్నారు.
నాణేనికి మరో వైపు.. కంపెనీలకు భారంగా మారుతున్న ఏఐ వ్యయాలు!
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఈ సాంకేతికతను నిర్వహించడం కంపెనీలకు అంత సులభంగా ఏమీ లేదు. అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధి, నిర్వహణ కోసం సంస్థలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. డేటా సెంటర్లు, హై-ఎండ్ జీపీయూ చిప్స్, సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కోట్ల డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. ఏఐ సిస్టమ్స్ నడవడానికి భారీగా ఎనర్జీ (విద్యుత్) అవసరమవుతోంది. మైక్రోసాఫ్ట్ , ఉబెర్, ఎన్వీడియో వంటి ప్రముఖ కంపెనీల్లో ఏఐ నిర్వహణ వ్యయాలు ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అంతర్గత నివేదికల ద్వారా తెలుస్తోంది. కొన్ని సంస్థలైతే తమ వార్షిక బడ్జెట్‌ను కేవలం ఐదు నెలల్లోనే ఖర్చు చేసేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఏై నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో, భవిష్యత్తులో కంపెనీలు పూర్తిగా ఏఐ మీదే ఆధారపడటానికి వెనుకంజ వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. టెక్నాలజీని ఎంత వాడుకున్నా.. మానవ నైపుణ్యాల అవసరం ఎప్పుడూ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ , హ్యూమన్ రిసోర్సెస్‌ను సమతూకంగా ఎలా ఉపయోగించుకోవాలో చూసే కంపెనీలు మాత్రమే నిలదొక్కుకోగలవు.
ప్రస్తుతానికి మాత్రం టెక్నాలజీ సృష్టిస్తున్న ఈ అనిశ్చితి.. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.
