ఇంజనీర్ల ఫ్యూచర్ కు ఏఐ చెక్... తెరపైకి షాకింగ్ అధ్యయనం!
ఇందులో ప్రధానంగా... సాఫ్ట్ వేర్ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం ఎక్కువగా పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 22 July 2025 3:00 PM ISTఇంజనీరింగ్ చదివితే భవిష్యత్ చాలా బాగుంటుంది అని చెప్పే కాలం నుంచి ఇంజనీర్ల భవిష్యత్తు ఏమిటి అనే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40% మంది.. అంటే 140 కోట్ల ఉద్యోగాలపై త్వరలో ప్రభావం ఉండబోతుందని ఓ ప్రముఖ అధ్యయన సంస్థ వెల్లడించింది! అందుకు కారణం... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!
అవును... తమకు ఫ్యూచర్ కు తిరుగులేదని భావించిన టెక్ ఇంజనీర్ల భవిష్యత్ పై నీలినీడలకు కారణమవుతోంది ఏఐ. ఈ సమయంలో... టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్ తో ఇంజనీర్ల భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైందని అంటున్నారు. గత కొంతకాలంగా వరుసగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళనలు తెరపైకి వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఏఐ మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూ.ఎన్.సీ.డీ.ఏ.డీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇందులో ప్రధానంగా... సాఫ్ట్ వేర్ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం ఎక్కువగా పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే... భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్ మన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా... ఇప్పటికే సగానికి పైగా టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్ ను రాస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై స్పందిస్తూ... ఒక్క ఏడాదిలో సాఫ్ట్ వేర్ కోడ్ లన్నింటినీ ఏఐ రాయగలదని చెప్పారు. ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అని అమెరికాకు చెందిన సోషల్ క్యాపిటల్ సీఈవో పలిహపితియా అభిప్రాయపడ్డారు. ఈ వరుస స్టేట్ మెంట్లు ఇంజనీర్లలో ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.
కాగా... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఇటీవల ఏఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామర్లను భర్తీ చేయలేదని.. ఇంకా 100 ఏళ్లు అయినా ఇది జరగని పని అని.. కోడింగ్ కు ఎంతో క్రియేటివిటీ అవసరమని.. ఏఐతో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
