ఏఐ విప్లవం: ఉద్యోగాలు పోతున్నాయి.. ఏం చేయాలి?
ఏఐ విప్లవం వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుంచి మొదలుపెడితే మామూలు కంపెనీల వరకూ అందరి ఉద్యోగాలు పోతున్నాయి. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు. ఇది మనసు మీద బురద పడే భయాల భూతం.
By: Tupaki Desk | 9 July 2025 11:55 AM ISTఏఐ విప్లవం వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుంచి మొదలుపెడితే మామూలు కంపెనీల వరకూ అందరి ఉద్యోగాలు పోతున్నాయి. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు. ఇది మనసు మీద బురద పడే భయాల భూతం. ఇది ఒక ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు. మానవ సంబంధాల సంక్షోభం కూడా.. ఎందుకంటే ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం ఆదాయాన్ని కోల్పోవడమే కాదు. ఒక గమ్యాన్ని, గౌరవాన్ని, జీవన ఉద్దేశ్యాన్ని కోల్పోవడమే.
అంథ్రోపిక్ సీఈఓ డారియో అమొడీ ప్రకారం.. మరో ఐదేళ్లలో సగం వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాల్సిన ఈ తరం ముందు.. ఆదాయానికి తొలి మెట్టు కనిపించకుండా పోతోంది. ఇది చిన్న మార్పు కాదు. ఒక మహా తరంగం. దీన్ని విస్మరించడం, అలమటించడం పరిష్కారం కాదు. పరిష్కారం దిశగా ముందడుగు వేయడమే మార్గం.
- మానవ మనస్తత్వంపై ముద్ర వేసే ఏఐ ప్రభావం
ప్రధానంగా మూడు రంగాలలో వ్యక్తులు, వ్యాపార నాయకులు, ప్రభుత్వాలు ఇప్పుడే స్పందించాల్సిన అవసరం ఉంది.
1. వ్యక్తులు ఏమి చేయాలి?
మీకు భయంగా ఉంది కదా? నలుగురిలో నలుగురికి ఇదే అనుభూతి. ఇది “ఉద్యోగ భయం” కాదు. ఇది గమనికలేని భవిష్యత్తుపై దుఃఖం. అందుకోసం మొదటి అడుగు ధైర్యంగా వేయాలి. మీ భావాలను గుర్తించండి. మీరు కోల్పోయినది కేవలం జీతం కాదు. మీ కలలు, మీ గుర్తింపు. ఏఐ చేయలేని పనులపై దృష్టి పెట్టండి. విశ్లేషణలు చేయగలిగేది యంత్రమే అయినా, అనుభూతిని అర్థం చేసుకోవడం, నమ్మకాన్ని నింపడం, నైతికతతో వ్యవహరించడం మనుషుల వంతే. ఐటీ స్కిల్స్ కాక, అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకోండి. సిస్టమ్స్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమస్య పరిష్కారం వంటి నైపుణ్యాలు మీకు లాంగ్‌టర్మ్ బలం. పాత "కేరీర్ లాడర్" ను వదిలేసి, కొత్త దారులు తయారు చేసుకోండి. స్టెబిలిటీ కాదు, ఫ్లెక్సిబిలిటీకి సిద్ధపడండి. బంధాలు పెంచుకోండి. భవిష్యత్తు వ్యక్తిగతం కాదు.. సామూహికం అని గుర్తించండి..
2. వ్యాపార కంపెనీల అధిపతులు ఏమి చేయాలి?
ఉద్యోగాల్ని తొలగించడం వల్ల లాభాలొస్తాయనుకుంటే ఒక విషయం గుర్తుంచుకోండి. యంత్రాలు ఎప్పుడూ నమ్మదగ్గవి కావు.. మనుషులే మార్కెట్‌కి ప్రాణం. విజ్ఞతతో కూడిన నాయకత్వం ఈ మార్గాలను చూపుతుంది. గౌరవం కోసం వేరే ఉద్యోగాలను డిజైన్ చేయండి. ఆటోమేట్ చేయలేమా అని కాదు. దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరిని మర్చిపోతున్నాం? అనే ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల స్థానంలో అభ్యాస కేంద్రాలు ఏర్పరచండి. లాభాల మార్గంగా కాకుండా మానవతా సామర్థ్యానికి పెట్టుబడులు పెట్టండి. ఓపికగా మాట్లాడండి, భయాల్ని అర్థం చేసుకోండి.. అస్పష్టత అనేది వికాసానికి అవకాశంగా మారాలే కానీ, భయంగా మిగలకూడదు. సిస్టమిక్‌గా ఆలోచించండి. ఉద్యోగుల పునఃప్రారంభం లేకుండా ఎలాంటి వ్యూహాలూ నిలబడవు.
3. ప్రభుత్వం ఏమి చేయాలి?
ప్రభుత్వాలు చూస్తూ ఉండకూడదు. ఇది భవిష్యత్తు సమస్య కాదు. ఇప్పుడే ప్రారంభమైపోయింది. ఇప్పుడు కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఏఐ ట్రాన్సిషన్ ఎమర్జెన్సీ ప్రకటించండి. వృత్తి మార్పులకు పెద్ద పథకాలతో ముందుకొచ్చే సమయం ఇది. సేఫ్టీ నెట్‌ను ఆధునీకరించండి. జీవితాలు లీనియర్ కాదంటే, బీమా/పదవీ భద్రతలు కూడా కొత్తగా ఆలోచించాలి. ఏఐపై బాధ్యత పెట్టండి. న్యాయం, పారదర్శకత, ప్రభావ విశ్లేషణలతోనే కొత్త టెక్నాలజీకి అనుమతి ఇవ్వాలి. మానవతా కేంద్రంగా ఉన్న ఆవిష్కరణలకు మద్దతివ్వండి. విశ్వాసాన్ని రాబట్టే కథలు చెప్పండి. భవిష్యత్తును నమ్మేలా ప్రజల్లో నూతన నైపుణ్యం తీసుకురండి.
ఇది మానవతా పరీక్ష!
ఏఐ వినియోగాన్ని తప్పుడు దిశలో తీసుకెళ్తే, మనం నిర్మించేది ఒక ఎందుకు పనికిరాని శూన్యమైన భవిష్యత్తు. కానీ ఇప్పుడే స్పందిస్తే ధైర్యంగా, దూరదృష్టితో, దయతో మనం సాంకేతికతతో మన మానవత్వాన్ని విస్తరింపజేసే భవిష్యత్తును నిర్మించగలం.
"ఏఐ పనిని చేస్తుందా?" కాదు.. "ఏఐ తో కూడిన ప్రపంచంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం?" అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
