'డిజిటల్ విజయ్'.. హోలోగ్రాఫిక్ ఏఐతో మాయ చేస్తున్న దళపతి!
ఇప్పుడు మనం టెక్నాలజీ కాలంలో ఉన్నాం. రోజుకో ఆధునిక సాంకేతికత గొప్ప ఆవిష్కరణలకు తెరతీస్తోంది.
By: Tupaki Political Desk | 13 April 2026 12:22 PM ISTఇప్పుడు మనం టెక్నాలజీ కాలంలో ఉన్నాం. రోజుకో ఆధునిక సాంకేతికత గొప్ప ఆవిష్కరణలకు తెరతీస్తోంది. ఈ ప్రభావం ఇప్పుడు రాజకీయాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే మైకులు, వాల్ పోస్టర్లు, భారీ బహిరంగ సభలకే పరిమితమయ్యేది. ఆ తర్వాత మొబైల్ ఫోన్లు విస్తృతమయ్యాక ఐవీఆర్ఎస్ కాల్స్ తో పార్టీల అధినేతలే ఫోన్లు చేసి మాట్లాడినట్లు రికార్డెడ్ వాయిస్ మెసెజెస్ వచ్చేవి. కానీ, ఇప్పుడు 'కృత్రిమ మేధస్సు' (AI) యుగం నడుస్తోంది. దీంతో ఎన్నికల ప్రచారం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక టెక్నాలజీకి ఏఐ కూడా తోడై ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగిస్తోంది. ఫలితంగా ఎన్నికల ముఖచిత్రమే పూర్తిగా మారిపోతోంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల బరిలో టీవీకే అధినేత విజయ్ వాడుతున్న ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ సాంకేతికత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏంటీ హోలోగ్రాఫిక్ ప్రచారం
సాధారణంగా మనం వీడియోలను స్క్రీన్‌పై చూస్తాం. కానీ హోలోగ్రామ్ అనేది ఒక వ్యక్తి భౌతికంగా అక్కడ లేకపోయినా, లేజర్ కిరణాల సాయంతో ఆ వ్యక్తి గాలిలో మన కళ్ళ ముందే నిలబడి ఉన్నట్లుగా 'త్రీడీ' (3D) రూపంలో చూపిస్తుంది. దీనికి ఏఐ (AI) తోడవ్వడం వల్ల, ఆ నాయకుడు కేవలం ఒక బొమ్మలా కాకుండా, ఓటర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి ప్రశ్నలకు స్పందిస్తున్నట్లుగా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
కుంభకోణంలో సంచలనం
విజయ్ తన పార్టీ ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాలను స్వయంగా సందర్శించలేకపోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం వల్ల సమయాభావం వల్ల అన్ని నియోజకవర్గాలను టచ్ చేయడం విజయ్ కి కష్టతరంగా మారింది. దీనికి పరిష్కారంగా ఆయన ఈ సాంకేతికతను ఎంచుకున్నారు. తాజాగా కుంభకోణంలో నిర్వహించిన ప్రచారంలో విజయ్ హోలోగ్రామ్ రూపంలో ప్రత్యక్షమై ప్రజలను పలకరించారు. ఈ డిజిటల్ మాయాజాలానికి ఓటర్లు విస్మయానికి గురయ్యారు. దళపతి విజయ్ నిజంగానే తమ మధ్య ఉన్నారనే భావన కలిగిందని అంటున్నారు.
డిజిటల్ కనెక్ట్
నాయకుడు నేరుగా తమతో మాట్లాడుతున్నట్లు అనిపించడంతో ఓటర్లు, ముఖ్యంగా యువత ఈ సరికొత్త ప్రచారానికి మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ సాగిస్తున్న ఈ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సాంకేతికతను వాడటం ఇది తొలిసారి కాదు. కానీ, ఏఐ సాయంతో విజయ్ చేసిన ప్రయోగం మాత్రం సరికొత్తదిగా చెబుతున్నారు. మన దేశంలో 2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ 3D హోలోగ్రామ్ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, అప్పటికి ఇప్పటికీ సాంకేతికతలో చాలా మార్పు వచ్చింది. అప్పట్లో అవి కేవలం ముందే రికార్డ్ చేసిన వీడియోలు. కానీ ఇప్పుడు ఏఐ వాడటం వల్ల నాయకుని హావభావాలు, గొంతు, సంభాషణలు మరింత సహజంగా, లైవ్‌గా ఉంటున్నాయి. డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచార సరళి మారుతోందని ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. విజయ్ ప్రవేశపెట్టిన ఈ 'హోలోగ్రాఫిక్ ఏఐ' భవిష్యత్తులో మన దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేయబోతోందని విశ్లేషిస్తున్నారు.
